Begin typing your search above and press return to search.

మ‌న‌మ్మాయికి గూగుల్ భారీ ఆఫ‌ర్!

By:  Tupaki Desk   |   7 Aug 2018 4:55 AM GMT
మ‌న‌మ్మాయికి గూగుల్ భారీ ఆఫ‌ర్!
X
దేశంలో ఉద్యోగాలు ఎక్క‌డ‌? ఈ ప్ర‌శ్న‌ను వేసింది సాక్ష్యాత్తు కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ. పాల‌కుల నుంచి స‌మాధానాలు కోరే ప్ర‌జ‌ల‌కు కీల‌క మంత్రి వేసిన ప్ర‌శ్న‌కు షాక్ త‌గిలే ప‌రిస్థితి. రాజ‌కీయాన్ని ప‌క్క‌న పెడితే.. దేశంలో ఉద్యోగ అవ‌కాశాల విష‌యంలో ఎదుర‌వుతున్న ఇబ్బందికి ఇదో నిద‌ర్శ‌నం మాత్ర‌మే. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఇబ్బందేమో కానీ.. ప్రైవేటు ఉద్యోగాలు కుప్ప‌లు కుప్ప‌లు ఉన్నాయ‌న్న మాట ఇప్పుడు వినిపించ‌ని ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌లో ఒక ప్ర‌ముఖ కంపెనీలో భారీ వేత‌న ప్యాకేజీని సొంతం చేసుకున్న ఒక క్యాంప‌స్ స్టూడెంట్ వైనం ఇప్పుడు వార్తాంశంగా మారింది.

ప్ర‌పంచంలో టాప్ టెన్ అత్యుత్త‌మ కంపెనీల్లో ఒక‌టైన గూగుల్ లో భారీ ప్యాకేజీని సొంతం చేసుకుందో అమ్మాయి. ఆమె మ‌రెవ‌రో కాదు.. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ కు చెందిన కుడుగుంట స్నేహారెడ్డి. ఆమెలో మ‌రో ప్ర‌త్యేక‌త ఉంది. దేశ వ్యాప్తంగా మెరిక‌ల్లాంటి ఐదుగురు ఉద్యోగుల కోసం గూగుల్ వెతికింది. తీవ్ర అన్వేష‌ణ అనంత‌రం ఐదుగురిని ఎంపిక చేసింది. ఆ ఐదుగురిలో ఒక‌రు స్నేహారెడ్డి. మ‌న‌కేమైనా కావాలంటే గూగుల్‌ ను వెతుకుతాం. మ‌రి.. అదే గూగుల్ త‌న సంస్థ‌లో ప‌ని చేసేందుకు అత్యంత ప్ర‌తిభావంతులైన ఐదుగురి కోసం అన్వేషించింది. చివ‌ర‌కు ఐఐటీ హైద‌రాబాద్‌ లో ఇటీవ‌ల బీటెక్ పూర్తి చేసిన స్నేహ‌కు భారీ ప్యాకేజీని ఆఫ‌ర్ చేసి త‌మ ఉద్యోగిగా చేసుకుంది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ‌) అంశంపై చేస్తున్న కీల‌క‌మైన ప్రాజెక్టులో ప‌ని చేసేందుకు రిక్రూట్ చేసింది. మ‌రింత కీల‌క‌మైన ప్రాజెక్టు అన్న‌ప్పుడు ఆఫ‌ర్ భారీగానే ఉంటుంది క‌దా? నిజ‌మే.. మీ అంచ‌నా క‌రెక్టే. రూ.1.20 కోట్ల భారీ ప్యాకేజీని ఆఫ‌ర్ ఇస్తూ జాబ్ ఇచ్చింది. ఆస‌క్తిక‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. స్నేహారెడ్డి చిన్న‌నాటి నుంచి పుస్త‌కాల పురుగు కాదు. ఆట‌లు.. ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటూ చ‌దివేది. ఇంట‌ర్ లో 98.4 శాతంతో పాస్ అయిన ఆమె.. 2014లో జేఈఈ మొయిన్స్ లో ఆల్ ఇండియా లెవెల్ లో 15వ ర్యాంకును సాధించింది. జేఈఈ అడ్వాన్స్ లో 677 ర్యాంకును సొంతం చేసుకుంది. అనంత‌రం ఐఐటీ హైద‌రాబాద్‌ లో బీటెక్ కంప్యూట‌ర్ సైన్స్ పూర్తి చేశారు. గూగుల్ చేప‌ట్టిన ప్ర‌తిష్ఠాత్మ‌క నేచుర‌ల్ లాంగ్వేజ్ అండ‌ర్ స్టాండింగ్ ప్రాజెక్టు కోసం స‌మ‌ర్థులైన వారి కోసం గూగుల్ వెతుకుతోంది.

ఆన్ లైన్లో సాగిన నాలుగు రౌండ్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసిన స్నేహారెడ్డి.. ఇంట‌ర్వ్యూ కోసం అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అయితే.. మ‌రో ముఖ్య‌మైన ప‌రీక్ష ఉండ‌టంతో ఆ ఇంట‌ర్వ్యూకు హాజ‌రు కాలేన‌ని పేర్కొంది. దీంతో..గూగుల్ ప్ర‌త్యేకంగా చివ‌రి రౌండ్‌నూ ఆన్ లైన్లో పూర్తి చేసి గూగుల్ లో జాబ్ ఇవ్వ‌టం మ‌రో విశేషంగా చెప్పాలి. స‌త్తా ఉంటే ఏమైనా సాధించొచ్చు అన్న దానికి మ‌న‌మ్మాయ్ స్నేహారెడ్డి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా చెప్ప‌క త‌ప్ప‌దు.