Begin typing your search above and press return to search.

సచిన్ చేతిలో బ్యాట్.. వార్న్ చేతిలో బంతి

By:  Tupaki Desk   |   31 Oct 2015 4:12 AM GMT
సచిన్ చేతిలో బ్యాట్.. వార్న్ చేతిలో బంతి
X
క్రికెట్ దేవుడు మళ్లీ మైదానంలోకి దిగితే.. తన మాయాజాలంతో వార్న్ బంతిని మెలికలు తిప్పితే.. వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ బంతిని ఉతికి ఆరేస్తే.. మేజిక్ రోడ్స్ ఫీల్డింగ్ లోకి దిగితే.. గంగూలీ.. సెహ్వాగ్.. సంగక్కర.. మురళీధరన్.. పాంటింగ్.. లారా.. అక్రమ్.. అక్తర్.. వెటోరీ ఇలాంటి వాళ్లంతా మళ్లీ క్రికెట్ ఆడితే. ఆలోచనే అదిరిపోయింది కదూ. అదే.. ఆచరణలోకి వస్తే క్రికెట్ అభిమానులకు పండుగే పండగ కదా.

మరి ఇలాంటి క్రికెట్ పండగే తెర మీదకు వచ్చేయనుంది. వారం రోజుల వ్యవధిలో నిజం కానున్న ఈ టోర్నీతో.. క్రికెట్ ను అమితంగా ఆరాధించే వారే కాదు.. క్రికెట్ మీద కనీస అవగాహన ఉన్న వారు సైతం టీవీలకు కళ్లు అప్పగించేయటం ఖాయమంటున్నారు. ‘‘ఆల్ స్టార్ క్రికెట్’’ పేరుతో ఊహకు అందని క్రికెట్ టోర్నీ రియాలిటీలోకి వచ్చేస్తోంది. దీంతో.. క్రికెట్ దిగ్గజాలు మళ్లీ పిచ్ లోకి దిగే ఆ ప్రత్యేక క్షణాలు ఎప్పుడు వస్తాయా? అని క్రికెట్ ప్రేమికులు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇంతకీ ఈ ఫార్మాట్ ఏంటి? దీని లక్ష్యం ఏమిటి? ఎవరెవరు ఆడుతున్నారు? లాంటి విషయాల్లోకి వెళితే..

ఇద్దరు ప్రముఖ ఆటగాళ్ల మనసుల్లో పుట్టిన ఫార్మాటే.. దిగ్గజ టోర్నీ. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.. షేన్ వార్నర్ లు ఇద్దరి మానసపుత్రికే ఈ దిగ్గజ టోర్నీ. అమెరికాలో నిర్వహించే ఈ టోర్నీలో ఇప్పటికే రిటైర్ మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు ఆడనున్నారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పేసి.. మళ్లీ మైదానంలో కనిపించరని భావించిన వివిధ దేశాల స్టార్ ఆటగాళ్లు కలిసి క్రికెట్ ఆడితే.. ఐడియానే అదిరిపోయింది కదూ. ఈ ఫార్మాట్ కు అభిమానుల ఆదరణ పక్కా కదూ. అందుకే ఈ ఐడియా టోర్నీ నిర్వహించే వరకూ వెళ్లింది.

అయితే.. ఈ కలల టోర్నీకి ఒక సందేశం ఇచ్చేందుకే నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. క్రికెట్ ను విశ్వవ్యాప్తంగా చేసే లక్ష్యంతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అమెరికా లాంటి దేశాల్లో క్రికెట్ కు పెద్ద ఆదరణ లేదు. అలాంటి దేశాల్లో క్రికెట్ ను కానీ భారీగా ప్రమోట్ చేయాలన్న లక్ష్యంతో సీనియర్లు అంతా ఇప్పుడు మైదానంలోకి మరోసారి దిగనున్నారు.

నవంబరు 7.. 11.. 14 మూడు రోజుల్లో నిర్వహించే ఈ ప్రత్యేక టోర్నీని అమెరికాలో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఐసీసీకి ఇస్తారు. ఆ మొత్తాన్ని అమెరికా క్రికెట్ అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. ఈ టోర్నీని టైంపాస్ కోసం అన్నట్లు కాకుండా.. సీరియస్ గా నిర్వహించాలని డిసైడ్ చేశారు. అంతే కాదు.. దీనికి ఐసీసీ గుర్తింపు ఉండటంతో.. పోటీ రసవత్తరంగా ఉండటం ఖాయం.

వివిధ దేశాల్లో క్రికెట్ కు ఆదరణ లభించేందుకు అని చెబుతున్న ఈ టోర్నీలో ఆడే ఆటగాడు ఒక్కొక్కరికి దాదాపు రూ.20లక్షల వరకూ పారితోషికంగా లభిస్తుందని చెబుతున్నారు. అంటే.. టోర్నీలో వాణిజ్యం అన్న పాయింట్ ప్రధానమన్న మాట. మరింత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే.. సచిన్.. వార్న్ మాస్టర్ మైండ్స్ భారీగానే స్కెచ్ గీశాయని చెప్పాలి. మరింత భారీ మొత్తం ఎలా ఇస్తారన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. మ్యాచ్ లతో పాటు దిగ్గజ క్రికెటర్లతో కలిసి లంచ్ లు.. డిన్నర్ లు.. పార్టీలు ఇలా చాలానే కార్యక్రమాలు ఉంటాయి. వీటిల్లో పాల్గొనే వారి దగ్గర నుంచి భారీగా వసూలు చేయనున్నారు. లంచ్ కోసం వచ్చే వారు దాదాపుగా రూ.2లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇక.. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కోసం టీవీ హక్కులు భారీ ధర పలకటం ఖాయమంటున్నారు. దిగ్గజ ఆటగాళ్లు మళ్లీ ఆడుతున్నారంటే ఆసక్తి పక్కా. టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీలో కాసులు కురవటం ఖాయమంటున్నారు. మరి.. ప్రేక్షకులు ఏ రేంజ్ లో వస్తారన్నది కీలకాంశంగా మారే వీలుంది. ఈ టోర్నీలో రెండు జట్లు పాల్గొంటాయి. ‘‘సచిన్ బ్లాస్టర్స్.. వార్న్ వారియర్స్ గా దిగ్గజ ఆటగాళ్లు అంతా రెండు జట్లుగా విడిపోయి ఆడనున్నారు. దాదాప ఏడాది పాటు చర్చల మీద చర్చలు జరిపిన తర్వాత సచిన్.. వార్న్ లు డిసైడ్ చేసిన టోర్నీగా దీన్ని చెప్పొచ్చు.

క్రికెట్ ప్రపంచంలో పేరున్న ఇద్దరు ఆటగాళ్లు కలిసి టోర్నీ నిర్వహిస్తే.. రానని చెప్పే దిగ్గజాలు ఎవరుంటారు. ఈ టోర్నీలో ఆడేందుకు 28 మంది దిగ్గజ ఆటగాళ్లు ఓకే చెప్పేశారు. భారత్ (సచిన్.. గంగూలీ.. లక్ష్మణ్.. సెహ్వాగ్.. అగార్కర్).. దక్షిణాఫ్రికా (పొలాక్.. డొనాల్డ్.. కలిస్.. క్లూసెనర్.. రోడ్స్).. శ్రీలంక (జయవర్దనె.. సంగక్కర.. మురళీధరన్).. ఆస్ట్రేలియా (పాంటింగ్.. మెక్ గ్రాత్.. హేడెన్.. సైమండ్స్).. ఇంగ్లండ్ (మైకల్ వాన్.. గ్రేమ్ స్వాన్).. వెస్టిండీస్ (లారా.. వాల్ష్.. అంబ్రోస్.. హూపర్).. పాకిస్థాన్ (అక్రమ్.. మొయిన్ ఖాన్.. అక్తర్.. సక్లెయిన్.. ముస్తాక్).. న్యూజిలాండ్ (వెటోరి)లు అడనున్నారు. రెండు జట్లలో ఎవరెవరు ఆడతారన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. మరికొద్ది రోజుల్లో దాన్ని పూర్తి చేయనున్నారు.

ఈ టోర్నీని నిర్వహించనున్న అమెరికాలో క్రికెట్ స్టేడియంలు లేవు కదా అన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. అక్కడున్న బేస్ బాల్ స్టేడియంలలో మ్యాచ్ లు నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం డ్రాప్ ఇన్ పిచ్ లు వినియోగించనున్నారు. ఇక.. వేదికల విషయానికి వస్తే.. న్యూయార్క్.. హోస్టన్.. లాస్ ఏంజిల్స్ లలో ఈ మూడు మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇంకెందుకు.. ప్రత్యేక టోర్నీ వీక్షించేందుకు సిద్ధమైపోండి.