Begin typing your search above and press return to search.

టీకా వేయకుంటే డెలివరీలు ఆపేస్తామంటూ వార్నింగ్

By:  Tupaki Desk   |   23 May 2021 7:32 AM GMT
టీకా వేయకుంటే డెలివరీలు ఆపేస్తామంటూ వార్నింగ్
X
బాబ్బాబు.. టీకా వేసుకోండన్న వేళ ఎవరూ వినని పరిస్థితి. చివరకు వైద్య సిబ్బంది మాత్రమే కాదు ఆరోగ్య కార్యకర్తలు సైతం సంశయించిన పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని వ్యాక్సిన్ కోసం ఆరాటం ఎక్కువైంది. తొలి దశ ముగిసి.. వ్యాక్సిన్ పరిమితస్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పుడు టీకా వేసుకోవటం పెద్ద విషయంగా భావించని వారికి భిన్నంగా ఇప్పుడు ఆ వర్గం.. ఈ వర్గం అన్న తేడా లేకుండా ఎవరైనా సరే టీకాకు సిద్ధమైపోతున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ల కొరతతో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి.

ఇలాంటివేళ.. టీకాల కోసం డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. ఎవరూ చేయని రీతిలో తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్స్ అసోసియేన్ హెచ్చరిక చేసింది. గ్యాస్ డీలర్లు.. సిబ్బంది.. డెలివరీ బాయిస్ కు ఈ నెల 29 నుంచి వ్యాక్సిన్ కానీ వేయకుంటే గ్యాస్ బండ డెలివరీ చేసేది లేదని తేల్చి చెప్పటం గమనార్హం.

కోవిడ్ కారణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున వైరస్ బారిన పడినట్లుగా పేర్కొంటున్నారు అసోసియేషన్ అధ్యక్ష.. కార్యదర్శులు. సిబ్బంది తమ ప్రాణాల్ని పణంగా పెట్టి గ్యాస్ బండల్ని డెలివరీ చేస్తున్నారని.. ఈ క్రమంలో తమకు వ్యాక్సినేషన్ వెంటనే వేయకుంటే.. తాము డెలివరీలు ఆపేస్తామని చెబుతున్నారు.

ఇలా ఎవరికి వారు డిమాండ్లు చేసి.. హెచ్చరికలు చేస్తే ప్రభుత్వం సైతం ఏం చేస్తుంది? గ్యాస్ బండ డెలివరీలు ఆగితే జరిగే నష్టం.. కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం ముదరకుండా ఉన్నప్పుడే.. కేసీఆర్ సర్కారు రియాక్టు అయి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే మంచిది. మరేం జరుగుతుందో చూడాలి.