Begin typing your search above and press return to search.

పార్టీకి గుడ్ బై చెప్పగానే.. ఏడేళ్ల కేసులో వారెంట్ ఇష్యూనా యోగి?

By:  Tupaki Desk   |   13 Jan 2022 3:09 AM GMT
పార్టీకి గుడ్ బై చెప్పగానే.. ఏడేళ్ల కేసులో వారెంట్ ఇష్యూనా యోగి?
X
ఆయనో మంత్రి. అధికారాన్ని అరచేతిలో పెట్టుకొని నిన్నటి వరకు దర్జాగా నడిచాడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి గుడ్ బై చెప్పేసి.. ప్రత్యర్థి పార్టీలోకి జంప్ అయ్యాడు. ఎన్నికల వేళలో ఇలాంటివి కామన్ కదా? అనుకోవచ్చు. నిజమే.. కానీ.. ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. మంత్రిగా ఇంత కాలం తమతో ఉన్న పెద్ద మనిషి.. అలా పార్టీ మారిన గంటల వ్యవధిలోనే.. సదరు మంత్రిగారి మీద ఏడేళ్ల క్రితం నాటి ఒక కేసుకు సంబంధించిన అరెస్టు వారెంట్ ఇష్యూ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది.

పార్టీకి రాజీనామా చేసిన 24 గంటల్లోపే ఆయన అరెస్టుకు వారెంట్ ఇష్యూ కావటమా? అంత తీవ్రమైన నేరమే చేసి ఉంటే.. ఇంతకాలం వారెంట్ ఇష్యూ కాలేదెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. వారెంట్ ఎపిసోడ్ కు సంబంధించి యోగి సర్కారు అనుసరిస్తున్న ఈ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆ మంత్రి పేరు (ఇప్పుడు మాజీ అనుకోండి) స్వామి ప్రసాద్ మౌర్య. ఆయన ఇంతకాలం ప్రాతినిధ్యం వహించిన పార్టీ బీజేపీ. యూపీలో ఇప్పుడు ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయనటానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే.

ఇంతకీ ఈ స్వామి ప్రసాద్ మౌర్య ఎవరు? ఏడేళ్ల క్రితం ఆయనపై నమోదైన కేసేంటి? అన్నది చూస్తే.. 2014లో మౌర్య బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో ఉండేవారు. హిందూ దేవలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఆయనపై సుల్తాన్ పూర్ లో కేసు నమోదైంది. 2016 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కేసుపై కోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఎమ్మెల్యేగా గెలిచిన స్వామిప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకోవటం.. యోగి సర్కారులో ఆయనకు మంత్రి పదవి లభించటంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది.

హిందూత్వానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు చెప్పుకునే బీజేపీ.. అదే హిందూ దేవతలపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను పార్టీలో ఎందుకు చేర్చుకున్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. మరోవైపుమౌర్యను మళ్లీ బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు చెబుతున్నా.. ఆయన మాత్రం కమలం పార్టీలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

ఇప్పటికే ఆయన సమాజ్ వాదీ పార్టీలో చేరినట్లుగా వార్తలు వస్తుంటే.. అవేమీ నిజం కావని.. తాను ఇంకా ఏ పార్టీలోకి చేరలేదని స్్పష్టం చేశారు. మొత్తంగా పార్టీలో ఉండి.. మంత్రిగా ఉన్నంత కాలం కనిపించని కేసు.. పార్టీ నుంచి బయటకు వచ్చిన 24 గంటల వ్యవధిలోనే అరెస్టువారెంట్ ఇష్యూ కావటం యోగి సర్కారు ఇమేజ్ ను భారీగా దెబ్బ తీసిందన్న మాట వినిపిస్తోంది.