Begin typing your search above and press return to search.

ఉచితాల రద్దు సాధ్యమేనా ?

By:  Tupaki Desk   |   4 Aug 2022 5:45 AM GMT
ఉచితాల రద్దు సాధ్యమేనా ?
X
ఉచిత పథకాలపై హామీఅనేది పెద్ద సమస్యగా మారిపోయింది. రాజకీయపార్టీలు ఎన్నికల సమయంలో ఇస్తున్న, అమలుచేస్తున్న ఉచితాల వల్ల దేశాభివృద్ధికి విఘాతం కలుగుతోందని నరేంద్రమోడీ ఆందోళన వ్యక్తంచేశారు. దానితర్వాత బీజేపీనేత అశ్వనీఉపాధ్యాయ సుప్రింకోర్టులో కేసు వేశారు. ఈ కేసు విషయమై తాజాగా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఉచిత హామల కట్టడికి ఒక కమిటీని వేశారు. నీతి ఆయోగ్, ఆర్బీఐ, లా కమీషన్, ఆర్ధికసంఘంలోని ముఖ్యలు సభ్యులుగా ఉన్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రతిపాదిత కమిటిలో అధికార, ప్రతిపక్షాల నుంచి ప్రతినిధులు లేరు. తమ ప్రతినిధులను వారం రోజుల్లోపు ఫైనల్ చేయటానికి చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఇక్కడ విషయం ఏమిటంటే నిజంగానే రాజకీయ పార్టీలు ఉచిత హామీలకు దూరంగా ఉండాలంటే ఏ పార్టీ కూడా ఉండదు. ఎందుకంటే దశాబ్దాల పాటు మన రాజకీయ వ్యవస్థ ప్రజలను ఉచిత పథకాలకు బాగా అలవాటు చేసేశాయి. కాబట్టి ఒక్కసారిగా ఉచితాలను రద్దు చేయాలంటే సాధ్యం కాదు.

ఒకవైపేమో ఉచిత, సంక్షేమ పథకాల వల్ల దేశాభివృద్ధి దెబ్బతింటోందని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ ముఖ్యమంత్రులతో ఈమధ్యే జరిగిన సమావేశంలో సంక్షేమపథకాలు పక్కాగా అమలుచేయాలని ఆదేశించారు. నిజానికి ఉచిత హామీలు ఇవ్వటంలో నీతిఅయోగ్, ఆర్బీఐ, లా కమీషన్, ఆర్ధికసంఘానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే పై సంఘాలు, సంస్ధల్లో ఎవరుండాలని నిర్ణయించేది రాజకీయ నేతలే. ఉచితాల, కట్టు దాటిన సంక్షేమ పథకాల అమలు కారణంగా అభివృద్ధి దెబ్బతింటోందనటంలో సందేహం లేదు.

అయితే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది రాజకీయ పార్టీలే కానీ పై సంస్థలు, సంఘాలు కావు. ముందు నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత హామీలకు మంగళం పాడాలి. తర్వాత ఎంత అవకాశముంటే అన్ని సంక్షేమ పథకాలకు బ్రేకులు వేయాలి.

అప్పుడే మిగిలిన పార్టీలు ఈ విషయాన్ని ఆలోచిస్తాయి. ఇలా చేస్తేనే ఉచితాలను నిలిపేసే విషయంలో మోడీకి ఉన్న చిత్తశుద్ది ఏమిటో ప్రంపంచానికి అర్ధమవుతోంది. ఇది జరగనంత వరకు ఏ పార్టీ కూడా సుప్రీంకోర్టు ప్రతిపాదనలను అంగీకరించవు.