Begin typing your search above and press return to search.

వైజాగ్ సాగర తీరంలో యుద్ధ నౌకల చక్కర్లు.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   16 Feb 2022 11:33 AM GMT
వైజాగ్ సాగర తీరంలో యుద్ధ నౌకల చక్కర్లు.. ఎందుకో తెలుసా?
X
విశాఖపట్నం... ప్రకృతి రమణీయతకు నిలువెత్తు నిదర్శనం. పర్యాటకానికి చిరునామా. నగరానికి అన్నివైపులా.. కొండలు. మరో వైపు అమ్మలాంటి సముద్రం. చుట్టుపక్కల దర్శనీయ ప్రదేశాలు, కైలాసగిరి, ఇలా చెప్పుకుంటూ లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. అయితే ఇలాంటి గ్రేటర్ విశాఖలో యుద్ధ నౌకలు సందడి చేస్తున్నాయి.

సముద్రానికి మాత్రమే పరిమితం అయి ఉండే ఇవి... ఇప్పుడు సాగర తీరంలో కనిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు ఏకంగా ఓ గుంపెడు యుద్ధ విమానాలు వైజాగ్ వాసులకు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. అయితే ఇలా యుద్ధనౌకలు సాధారణంగా కనించవు. కానీ విశాఖలో త్వరలో జరగనున్న ఓ కార్యక్రమం కోసం ఇవి క్యూ కట్టాయి.

కేవలం యుద్ధ నౌకలు మాత్రమే కాదు. హెలికాఫ్టర్లు కూడా సాగర తీరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ అని స్థానికులు చెబుతున్నారు. నార్మల్ గా అయితే వీటిని చూడాలి అంటే చాలా కష్టమని అంటున్నారు. ఇలా ఈ యుద్ధ నౌకలు, హెలికాఫ్టర్ల సందడికి ఓ కారణం ఉంది.

ఈ నెలలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వైజాగ్ కు రానున్నారు. వైజాగ్ లో ఉన్న తూర్పు నావికాదళంలో 21 వ తేదీన ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూ కార్యక్రమం ఉంది. దీనికి ప్రత్యేక అతిధిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరవుతారు. దీనిలో భాగంగానే ఈ యుద్ధ నౌకలు ఒక్కొక్కటిగా తీరానికి చేరుకుంటున్నాయి. ఆ రోజున నావికా దళ అధికారులు, సిబ్బంది, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆ కార్యక్రమానికి హాజరు అవుతారు. ఈ నేపథ్యంలోనే నావికా దళం కొన్ని ప్రదర్శన కార్యక్రమాలను నిర్వహించాలని చూస్తోంది. దీంతో సాగర తీరంలో ఎక్కువ యుద్ధ విమానాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే చాలా నౌకలు, హెలికాఫ్టర్లు తీరంలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం అదే స్థాయిలో రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. దీంతో సాగరం తీరం అంతా సందడిగా మారింది.

ఇదిలా ఉంటే యుద్ధ నౌకల రాకతో తీరం ప్రాంతంలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. చూట్టూ పక్కల ఎటు చూసినా యుద్ధ నినాదాలే వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా మరికొన్ని నౌకలు విశాఖకు చేరుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి ఎక్కడా ఎటువంటి లోపాలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నౌకలకు క్లియరెన్స్ ఇవ్వడంలో ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారు.

రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా... వైజాగ్ అంతా అధికారుల భద్రతా వలయంలోకి వెళ్లి పోయింది. వివిధ బెటాలియన్ లకు చెందిన పోలీసులు, సైన్యానికి చెందిన కొందరు అధికారులు ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూ కార్యక్రమం జరిగే ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, ఏపీ అధికారుల బృందాలు కూడా హాజరు కానున్నాయి.