Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు సొంత సామాజికవర్గమే షాకిచ్చిందా ?

By:  Tupaki Desk   |   6 Dec 2020 11:30 AM GMT
చంద్రబాబుకు సొంత సామాజికవర్గమే షాకిచ్చిందా ?
X
అవుననే అంటున్నాయి తెలుగుదేశంపార్టీ వర్గాలు. చంద్రబాబుకు సొంత సామాజకవర్గం షాక్ ఇవ్వటమేంటని అనుమానం రావచ్చు. కానీ జరిగింది మాత్రం ఇదే అంటే ఎవరు నమ్మలేరు. ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా వెల్లడైన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఒక్క డివిజన్లో కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. 150 డివిజన్లకు తెలుగుదేశంపార్టీ 111 డివిజన్లలో నామినేషన్లు వేసింది. అయితే స్క్రూటినిలో 5 నిమినేషన్లు రెజెక్టు కావటంతో చివరకు 106 డివిజన్లలో టీడీపీ పోటీ చేసింది. చివరకు ఫలితాల్లో తేలిందేమంటే చాలా చోట్ల కనీసం డిపాజిట్లు కాలే రాలేదని. గెలుపు అవకాశం కాదుకదా కనీసం ఎక్కడా గట్టిపోటి కూడా ఇవ్వలేకపోయింది.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే నామినేషన్లు వేయగానే తమ్ముళ్ళ తరపున చంద్రబాబానాయుడు కానీ లోకేష్ కానీ ప్రచారం చేయలేదు. ఇద్దరు హైదరాబాద్ లోనే ఉన్నా ప్రచారం కోసం గడప కూడా దాటలేదు. అయితే తాము ప్రచారానికి రాకపోయినా ఏపిలోని పలువురు కమ్మ సామాజికవర్గం వాళ్ళతో చంద్రబాబు మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఏపిలో పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో యాక్టివ్ గా ఉండే హైదరాబాద్ వాళ్ళని టీడీపీ తరపున ప్రచారం చేయమని చంద్రబాబు అడిగారట.

సీమాంధ్రులు ప్రధానంగా కమ్మ సామాజికవర్గం వాళ్ళు ఎక్కువగా శేరిలింగంపల్లి, కేత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, కుకట్ పల్లి, మియాపూర్, నిజాంపేట లాంటి చోట్ల ప్రచారం చేయాలని చంద్రబాబు ఫోన్లు చేసి మరీ అడిగారట. అయితే ఎవరు కూడా టీడీపీ తరపున ప్రచారం చేయటానికి ఇష్టపడలేదని సమాచారం. తాము ప్రచారం చేయటం వల్ల జరగబోయే నష్టాన్ని చంద్రబాబుతో నేరుగానే చెప్పేశారట. ప్రస్తుత పరిస్ధితుల్లో తాము బహిరంగంగా టీడీపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయలేమని నేరుగానే చెప్పేశారట.

తాము ప్రచారం చేయటం వల్ల అధికార టీఆర్ఎస్ తో శతృత్వం పెంచుకునే పరిస్దితుల్లో లేమని చంద్రబాబుకు చెప్పారట. ఉద్యమ సమయంలో ఎలాగున్నా గడచిన ఆరేళ్ళల్లో తాము ప్రశాంతంగానే ఉన్నామని, కాబట్టి కోరి ఎవరితోను గొడవలు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారట. విచిత్రమేమంటే ప్రచారం చేయటం సాధ్యంకాదని చెప్పిన వాళ్ళల్లో ఇపుడు పార్టీలో యాక్టివ్ గా ఉన్న ఏపి కమ్మ ప్రముఖులు కూడా ఉన్నారట. ఏపిలోని పార్టీ కమ్మ సామాజికవర్గం వాళ్ళే బహిరంగంగా ప్రచారం చేయటానికి వెనకాడినపుడు ఇక హైదరాబాద్ లో ఉండే కమ్మ సామాజికవర్గం మాత్రం ఎందుకొస్తుంది ? మొత్తానికి చంద్రబాబుకు జనాలే కాదు సొంత సామాజికవర్గంలోని ప్రముఖులు కూడా షాకిచ్చారని అర్ధమైపోయింది.