Begin typing your search above and press return to search.

చంద్రబాబు విషయంలో తప్పు జరిగిందా ?

By:  Tupaki Desk   |   12 Oct 2021 9:30 AM GMT
చంద్రబాబు విషయంలో తప్పు జరిగిందా ?
X
రాజకీయాలు వేరు ప్రోటోకాల్ వేరు. రాజకీయంగా ప్రత్యర్ధుల విషయంలో ఎంత వివాదమైన ఉండచ్చు. అయితే ప్రోటోకాల్ విషయంలో ప్రత్యర్ధుల విషయంలో పాటించాల్సిన కనీస మర్యాదలు పాటించాల్సిందే. ఇదంతా ఎందుకంటే చంద్రబాబునాయుడు విషయంలో వైసీపీ ప్రభుత్వం పాటిస్తున్న ప్రోటోకాల్ తప్పుదోవ లో వెళుతోంది కాబట్టే. ఈనెల 12-14 తేదీల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. తన పర్యటనలో మామూలుగా అయితే ఆర్ అండ్ బీ అతిథి గృహంలో చంద్రబాబు బస చేస్తారు.

కానీ ఈసారి మాత్రం తన బస్సులోనే లాడ్జింగ్, బోర్డింగ్ ఏర్పాటు చేసుకున్నారట. ఎంతైనా గెస్ట్ హౌస్ లో బస చేయడం వేరు బస్సులో ఉండటం వేరు. మంచం మీద పడుకుంటే రిలాక్సేషన్ ఎంత ఖరీదైన సోషాసెట్లో పడుకుంటే మాత్రం ఎలా వస్తుంది ? కానీ ఆ విషయం తెలీకుండానే చంద్రబాబు తన బస్సులోనే బస చేయాలని డిసైడ్ చేశారా ? అంటే దీనికి కొంత నేపధ్యముంది. అదేమిటంటే ఆ మధ్య చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సరైన ప్రోటోకాల్ పాటించలేదట.

మొన్నటి ఫిబ్రవరి 24-26 మధ్య కుప్పంలో పర్యటించినప్పుడు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేశారట. అయితే 25వ తేదీన తెల్లవారుజామున 4.30-5.30 మధ్య మళ్ళీ ఉదయం 7.30-8.30 గంటల మధ్య గెస్ట్ హౌస్ లో కరెంటు పోయిందట. ప్రభుత్వాధికారులే ఉద్దేశ్యపూర్వకంగా కరెంటు తీసేశారని చంద్రబాబు అండ్ కో బలంగా నమ్ముతున్నారు. ప్రభుత్వాధికారుల దేముంది అధికార పార్టీ నేతలు ఏమి చెబితే అది చేస్తారు. అధికారంలో ఎవరుంటే యంత్రాంగానికి ఏముంది ? ఎంతమంది విచక్షణతో పని చేస్తున్నారో తెలీదా ?

గెస్ట్ హౌస్ లో చంద్రబాబు దిగిన గదిలో బెడ్ కింద బిర్యానీ ముక్కలు, వార్డురోబ్ లో మందు బాటిళ్లు కనిపించాయట. గదిని కూడా శుభ్రం చేయలేదట. చంద్రబాబు అనే కాదు మనం కూడా గది ఇంత అపరిశుభ్రంగా ఉంటే దిగటానికి ఏమాత్రం ఇష్టపడం. మామూలు వాళ్ళే గది నీట్ గా ఉండాలని కోరుకునేటపడు ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయి వ్యక్తి వస్తే ఇంకెంత నీట్ గా ఉండాలి గది. అసలు చంద్రబాబు దిగినపుడు గెస్ట్ హౌస్ లో కరెంటు పోవడం ఏమిటి విచిత్రం కాకపోతే.

గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చిన్నట్లుంది కాబోలు అందుకనే సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. గెస్ట్ హౌస్ పెట్టుకుని చంద్రబాబు బస్సులో బసచేయటం అంటే అది ప్రభుత్వానికే అవమానం. అధికారంలో ఎవరున్నారన్నది అప్రస్తుతం. ఈరోజు చంద్రబాబు మాజీ అయితే ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ అవ్వక తప్పదు. అప్పుడు జగన్ కు కూడా ఇలాంటి ప్రోటోకాలే ఎదురైతే ఎలాగుంటుంది ? కాబట్టి అధికారం, ప్రతిపక్షంతో సంబంధం లేకుండా ఎవరికి దక్కాల్సిన ప్రోటోకాల్ వాళ్ళకి దక్కితే ప్రభుత్వానికి గౌరవంగా ఉంటుంది.