Begin typing your search above and press return to search.

కస్టమర్లకు ఫైన్ వేస్తున్న హోటల్

By:  Tupaki Desk   |   14 Nov 2015 9:46 AM GMT
కస్టమర్లకు ఫైన్ వేస్తున్న హోటల్
X
ముంబయిలోని ఒక హోటల్ చిత్రమైన విధానానికి తెర తీసింది. ఒక విధంగా చూస్తే.. ఈ హోటల్ అనుసరిస్తున్న విధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కూడా. హోటళ్లకు వచ్చే వారిలో పలువురు వివిధ కారణాలతో ఆహారాన్ని వృధా చేస్తుంటారు. హోటల్ కు వచ్చే వినియోగదారుని ఏమీ అనకుండా హోటల్ యాజమాన్యాలు ఊరకుండిపోతుంటాయి. అయితే.. ముంబయికి చెందిన ఉడిపి ఇడ్లీ హౌస్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది.

కందిపప్పు ధర ఆకాశాన్ని అంటుతున్న వేళ.. సాంబార్ ఇడ్లీ ధరను పెంచకుండా వెరైటీ రూల్ పెట్టి అందరి దృష్టిని తనవైపు పడేలా చేసింది. ఇటీవల పెరిగిన వస్తు ధరల నేపథ్యంలో ఆహారపదార్థాల ధరలు పెంచలేదు. అయితే.. ఎవరైనా ఫుడ్ ని వృధా చేస్తే మాత్రం రూ.13 ఫైన్ విధిస్తున్నారు. ముఖ్యంగా సాంబార్.. రసం కానీ వృధా చేస్తే ఫైన్ చెల్లించాల్సిందే. వడ్డించుకున్న సాంబార్ మిగల్చకుండా తింటే ఓకే. అలా కాకుండా మిగిలిస్తే మాత్రం రూ.13 హోటల్ కు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. హోటల్ వారు తీసుకున్న నిర్ణయంపై కస్టమర్లు అగ్రహం వ్యక్తం చేయకుండా.. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు.. గతంలో మాదిరి ఫుడ్ వృధా చాలావరకు తగ్గిపోయిందట. రేట్లు పెంచకుండా తీసుకున్న వినూత్న నిర్ణయానికి వచ్చిన ప్రచారంతో సదరు హోటల్ రద్దీ మరికాస్త పెరిగిందట.