Begin typing your search above and press return to search.

కమలనాథుడి వైచిత్రి... పోర్న్ వీక్షణ దేశ ద్రోహమేమీ కాదట

By:  Tupaki Desk   |   6 Sep 2019 1:40 PM GMT
కమలనాథుడి వైచిత్రి... పోర్న్ వీక్షణ దేశ ద్రోహమేమీ కాదట
X
బీజేపీ నేతలకు ఇప్పుడు నిజంగానే ఓ మోస్తరు నిర్లక్ష్య ధోరణితో పాటుగా ఏం చేసినా... ఏమవుతుందిలే అన్న భావన కూడా బాగానే ఎక్కువైనట్లుగా కనిపిస్తోంది. కేంద్రంలో వరుసగా రెండో పర్యాయం అధికార పగ్గాలు దక్కడంతోనే ఈ తరహా భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ భావనతోనే ఆ పార్టీకి చెందిన నేతలు ఎంత మాట నోటికొస్తే అంత మాటా అనేస్తున్నారు. ఆ మాటలు ఇటు మంటలు రేపినా, అటు వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా ఉంటున్నా కూడా పట్టించుకునే పరిస్థితి బీజేపీలో కనిపించడం లేదు. ఇలాంటి భావనతోనే కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, సీఎం యడ్యూరప్ప కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఓ కమలం నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూడటం నేరమేమీ కాదని ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యతో పాటు ఆ పని ఏమైనా దేశ ద్రోహంతో సమానమా? అంటూ ప్రశ్నించి కలకలరే రేపారు.

అయినా ఆ కమలం మంత్రి ఏమన్నారు? సందర్భం ఏమిటన్న వివరాల్లోకి వెళితే... గతంలో నిండు సభలోనే కర్ణాటక బీజేపీ శాఖకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పోర్న్ వీడియోలు చూస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటన నాటు పెను కలకలమే రేపింది. ఈ విషయంపై ఇటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో నాటి సీఎం సదానంద గౌడ... సదరు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు. వారు ఆ తర్వాత ఎన్నికల్లో నిలిచినా గెలవలేదనుకోండి. తాజాగా వారిలో ఒకరైన లక్ష్మణ్ ఈ దఫా ఎన్నికల్లో ఓటమిపాలైనా యడ్డీ సర్కారులో ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కింది. దీంతో అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన కమలం నేతకు డిప్యూటీ సీఎం పదవి దక్కిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విమర్శలపై తనదైన శైలిలో స్పందించేందుకు ఎంట్రీ ఇచ్చిన బీజేపీ నేత, యడ్డీ కేబినెట్ లో సభ్యుడిగా ఉన్న మధుస్వామి... లక్ష్మణ్ చర్యను సమర్థించేలా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూడటం పెద్ద తప్పేమీ కాదని పేర్కొన్న మధు స్వామి... అదేమీ దేశ ద్రోహం కిందకు రాదు కదా అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు కావాలని అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూడలేదని, ఏదో అలా పోర్న్ వీడియోలో ఓపెన్ అయితే వాటిని వారు చూశారని, ఇందులో వారి తప్పేమీ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అందరూ తప్పులు చేస్తారని, అలాగే వాళ్లు కూడా ఓపెన్ అయిన వీడియోలను చూశారే తప్పించి దేశ ద్రోహానికేమీ పాల్పడలేదని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో పోర్న్ చూడటం జాతి వ్యతిరేకమేమీ కాదని కూడా ఆయన సూత్రీకరించిన వైనం చూస్తుంటే... బీజేపీ నేతలకు నిజంగానే ఏదో అయ్యిందని చెప్పక తప్పదు.