Begin typing your search above and press return to search.

సినిమా సెట్టింగా? ఏపీ స‌చివాల‌య‌మా?

By:  Tupaki Desk   |   20 Aug 2018 10:34 AM GMT
సినిమా సెట్టింగా?  ఏపీ స‌చివాల‌య‌మా?
X
పేరు క‌క్కుర్తి తెచ్చే తిప్ప‌లు అన్ని ఇన్ని కావు.హ‌డావుడి ఉండాలి. కానీ.. అదంతా పేరు కోస‌మ‌న్న‌ట్లుగా ఉండ‌కూడ‌దు. ఒక‌వేళ హ‌డావుడి ప‌డినా.. చేసిన ప‌నిలో లోపం దొర్ల‌కుండా చూసుకోవ‌టం చాలా అవ‌స‌రం. అలాంటిది ఉందో లేదో కానీ.. భారీ వ‌ర్షం ప‌డితే చాలు..అమ‌రావ‌తిలో నిర్మించిన ఏపీ తాత్కాలిక స‌చివాల‌యం వార్త‌ల్లోకి వ‌చ్చే ప‌రిస్థితి.

వంద‌ల కోట్ల‌తో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించిన‌ట్లు చెప్పే ఏపీ స‌చివాల‌యం సినిమా సెట్టింగ్‌ను త‌ల‌పిస్తుంద‌న్న విమ‌ర్శ మొద‌ట్నించి ఉంది. ఆ మ‌ధ్య‌న నిర్మాణం పూర్తి చేసుకొని.. ఘ‌నంగా ప్రారంభోత్స‌వాల సిరీస్ ముగిసిన త‌ర్వాత‌.. వ‌ర్షం ప‌డ‌టం.. దీంతో లీకుల భాగోతం బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే.

తాజాగా అలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. గ‌డిచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఏపీ స‌చివాల‌యంలోని మంత్రుల ఛాంబ‌ర్ల‌లోకి నీరు వ‌చ్చి చేరిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్ర‌జాధ‌నాన్ని ప‌ప్పుబెల్లాల మాదిరి పంచి పెట్టిన‌ట్లుగా నాసిర‌కం నిర్మాణాలే.. లీకుల‌కు కార‌ణ‌మ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

భారీ వ‌ర్షాల‌కు స‌చివాల‌యం ముందు వ‌ర్ష‌పు నీరు భారీగా నిలిచి ఉండ‌టం ఒక ఎత్తు అయితే.. మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు.. అమ‌ర్నాథ‌రెడ్డి.. దేవినేని ఉమ ఛాంబ‌ర్ల‌లో సీలింగ్ఊడిప‌డి.. ఏసీల్లోకి వ‌ర్ష‌పు నీరు వ‌చ్చి చేరిన‌ట్లుగా చెబుతున్నారు.

నాలుగైదు బ్లాకుల్లో నిర్మించిన ప‌లు సెక్ష‌న్ల సీలింగ్ లు ఊడిప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీ బిల్డింగ్‌లోనూ ప‌లు చోట్ల సీలింగ్ ఊడిపోయి వ‌ర్ష‌పు నీరు వ‌చ్చి చేరిన‌ట్లుగా తెలుస్తోంది. లీకేజీల కార‌ణంగా అసెంబ్లీ మొద‌టి అంత‌స్తులోని రిపోర్టింగ్ సెక్ష‌న్లో వ‌ర్ష‌పునీరు వ‌చ్చి చేరుతుంద‌ని చెబుతున్నారు. ఏపీ స‌చివాల‌యం కంటే సినిమా సెట్టింగులు స్ట్రాంగ్ గా ఉంటాయ‌న్న విమ‌ర్శ‌లు ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇదే త‌ర‌హాలో అమ‌రావ‌తిలోని మిగిలిన నిర్మాణాలు క‌డితే.. ఏపీ ప‌రువు ఏం కావాలి? ఇదేనా చంద్ర‌బాబు పాల‌నా సామ‌ర్థ్యం అన్న ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.