Begin typing your search above and press return to search.

కల్తీ మద్యం సంఘటన..వేళ్లన్నీ ఆ కాంగ్రెస్ నేత వైపే

By:  Tupaki Desk   |   7 Dec 2015 9:30 AM GMT
కల్తీ మద్యం సంఘటన..వేళ్లన్నీ ఆ కాంగ్రెస్ నేత వైపే
X
విజయవాడలో కృష్ణలంకలోని స్వర్ణబార్‌ లో కల్తీ మద్యం తాగి ఏడుగురు మరణించిన కేసులో వేళ్లన్నీ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువైపే చూపిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో స్వర్ణ బార్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. పరీక్షల నిమిత్తం బార్‌ లోనుంచి మద్యం నమూనాలను పోలీసులు సేకరించారు. కాగా ఈ బార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందినదిగా ఆరోపణలు వస్తున్నాయి. స్వర్ణ బార్ విష్ణుదేనని విజయవాడ ఎమ్మెల్యే, టీడీపీ నేత గద్దె రామ్మోహనరావు అంటుండగా విష్ణు మాత్రం ఖండిస్తున్నారు. ఆ బార్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని... అది తన బంధువులదని ఆయన చెప్తున్నారు.

అంతేకాదు... ఈ సంఘటనపై మల్లాది విష్ణు పరిశోధన కూడా మొదలు పెట్టారు. బార్ లో మద్యం తాగినవారు చావుకు కారణం కారణం కల్తీ మద్యం కాదని... అక్కడ నీరు కల్తీ కావడమేనని చెప్తున్నారు. బార్ లో మద్యంలో మినరల్ వాటర్ కలుపుకొని తాగినవారంతా బాగానే ఉన్నారని.. కానీ, బార్ లోని వాటర్ కూలర్ లోని నీటిని కలుపుకొని తాగినవారు మాత్రమే మరణిచారని విష్ణు చెప్తున్నారు. దాని ప్రకారం ఆ కూలర్ లో ఎవరో ఏదో కలిపారని అర్థమవుతోందని ఆయన వాదిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలంటున్నారు.

కాగా ఆ బార్ విష్ణు బంధువుల పేరుతో ఉన్నప్పటికీ వారు విష్ణు బినామీలని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే తనది కాదని చెప్తున్నా మొత్తం వ్యవహారంపై ఆయన కంగారు పడుతున్నారని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే కల్తీ మద్యం కేసు మల్లాది విష్ణు మెడకు చుట్టుకున్నట్లే ఉంది.