Begin typing your search above and press return to search.

జగన్ కు మచ్చ వచ్చే పని చేస్తున్న ఇరిగేషన్ అధికారులు?

By:  Tupaki Desk   |   10 Sep 2019 8:34 AM GMT
జగన్ కు మచ్చ వచ్చే పని చేస్తున్న ఇరిగేషన్ అధికారులు?
X
ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ఎగువ నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు.. అప్పటికే డ్యామ్ లోని నీరు దాదాపు పూర్తి సామర్థ్యంతో ఉన్నప్పుడు.. లెక్క విషయంలో చాలా పక్కాగా ఉండాలి. లేకుంటే.. జరిగే నష్టం భారీగా ఉంటుంది.

తాజాగా అధికారుల నిర్లక్ష్యం శ్రీశైలం డ్యామ్ ను డ్యామేజ్ చేసే వరకూ వెళ్లటం గమనార్హం. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంలోకి పెద్ద ఎత్తున నీరు వస్తోంది. ఇలాంటి సమయంలో లెక్కలు చూసుకొని దిగువకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

ప్రస్తుతం ఆరు గేట్లను 17 అడుగుల మేర ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే.. ఆనకట్ట గేట్ల నిర్వహణలో ఉండే అధికారుల నిర్లక్ష్యంతో.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఎగువ నుంచి వచ్చే నీటిని సరైన సమయంలో వదలాల్సి ఉన్నా.. ఆ పని చేయని కారణంగా.. డ్యామ్ గేల్ మీద నుంచి నీరు పారింది. దీంతో.. అలెర్ట్ అయిన అధికారులు శ్రీశైలం గేట్లను మరింత పైకి ఎత్తి.. నీటిని దిగువనకు వదిలారు.

ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా జరుగుతుందని.. ఇలాంటిది పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే చోటు చేసుకుందన్న విమర్శ వినిపిస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.90 అడుగుల వరకూ ఉంది. మొత్తం నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 21.32 టీఎంసీలు.

శ్రీశైలం నుంచి భారీగా వరద నీటిని కిందకు వదులుతున్న నేపథ్యంలో.. నాగార్జున సాగర్ 14 క్రస్ట్ గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువనకు వదులుతున్నారు. సాగర్ కు ఇన్ ఫ్లో 2,75,319 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. కిందకు 1,20,319 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా.. ఇప్పటికే 589.2 అడుగుల నీరు ఉంది. దీంతో.. పై నుంచి వస్తున్న ఫ్లో కు తగ్గట్లు కిందకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి బెజవాడ మీదుగా సముద్రంలోకి కలుస్తుంది. నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల విషయంలో జగన్ ఒకచూపు చూడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.