Begin typing your search above and press return to search.

నీళ్ల పంచాయితీ కోర్టు చెంత‌కు.. తెలంగాణ హైకోర్టుకు ఏపీ రైతులు!

By:  Tupaki Desk   |   4 July 2021 6:30 AM GMT
నీళ్ల పంచాయితీ కోర్టు చెంత‌కు.. తెలంగాణ హైకోర్టుకు ఏపీ రైతులు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ మ‌ధ్య మొద‌లైన‌ జ‌ల వివాదం కోర్టు చెంత‌కు చేరింది. ఇన్నాళ్లూ రాజ‌కీయ పార్టీల నేత‌లు, అధికారుల మ‌ధ్య కొన‌సాగిన వివాదంలోకి ఇప్పుడు రైతులు ప్ర‌వేశించారు. ఈ పంచాయ‌తీ కార‌ణంగా త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోందంటూ అన్న‌దాత‌లు స‌రిహ‌ద్దు దాటి తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూడా ప్ర‌తివాదులుగా చేర్చి, త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోర్టును వేడుకున్నారు.

ఏపీ అక్ర‌మ ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని తెలంగాణ‌.. తెలంగాణ అనుమ‌తి లేకుండా విద్యుత్ ఉత్ప‌త్తి మొద‌లు పెట్టింద‌ని ఏపీ.. పోట్లాడుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శ్రీశైలంతో పాటు.. నాగార్జున సాగ‌ర్‌, దాని కింద ఉన్న పులిచింత ప్రాజెక్టులోనూ విద్యుత్ ఉత్ప‌త్తి మొద‌లు పెట్టడంతో వివాదం మ‌రింత పెరిగింది.

దీనివ‌ల్ల వేలాది క్యూ సెక్కుల నీరు దిగువ‌కు వెళ్లిపోతోంది. పులి చింత‌ల నుంచి ప్ర‌కాశం బ్యారేజీ వైపు భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తుండ‌డంతో.. అనివార్యంగా ప్ర‌కాశం బ్యారేజీ గేట్ల‌ను ఎత్తేశారు ఏపీ అధికారులు. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 9,000 క్యూసెక్కుల నీటిని స‌ముద్రంలోకి విడుద‌ల చేసిన‌ట్టు తెలుస్తోంది.

అన్యాయంగా ఈ నీరు స‌ముద్రంలో క‌లిసిపోతోంద‌ని, అంతిమంగా తాము న‌ష్ట‌పోతున్నామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన‌ రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. కృష్ణా జిల్లాకు చెందిన గూడ‌వ‌ల్లి శివ‌రామ‌కృష్ణ ప్ర‌సాద్‌, ఎమ్‌. వెంక‌ట‌ప్ప‌య్య తెలంగాణ హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌తోపాటు కేంద్ర జ‌ల‌న‌వ‌రుల శాఖ‌, కృష్ణాబోర్డు, తెలంగాణ జెన్కో, ఏపీ ఇరిగేష‌న్ శాఖ‌ల‌ను ప్ర‌తివాదులుగా చేర్చారు.

జూన్ 28వ తేదీన తెలంగాణ స‌ర్కారు జారీచేసిన జీవోను ర‌ద్దు చేయాల‌ని కోరారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నూటికి నూరు శాతం విద్యుత్ ఉత్ప‌త్తి చేయాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వం జీవోను జారీచేసింది. ఆ జీవో వ‌ల్ల ప్రాజెక్టుల్లో నీళ్ల‌న్నీ ఖాళీ అవుతున్నాయ‌ని, దానివ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతుల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంద‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.