Begin typing your search above and press return to search.

భారత్ కు మరో ముప్పు: నీటి కొరతతో వైరస్ విజృంభణ?

By:  Tupaki Desk   |   14 Jun 2020 7:30 AM GMT
భారత్ కు మరో ముప్పు: నీటి కొరతతో వైరస్ విజృంభణ?
X
ప్రస్తుతం మహమ్మారి వైరస్ తీవ్రంగా ప్రబలుతోంది. వైరస్ కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో మరో ముప్పు పొంచి ఉంది. నీటి కొరత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. నీటి కొరత, పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రజలు ఎక్కువగా వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే మహమ్మారి వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉంది.

జూన్‌ 10వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 46 శాతం కేసులు ఐదు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లలోనే నమోదయ్యాయి. ఈ రాష్ట్రాల్లో రక్షిత తాగునీరు - అపరిశుభ్రత - చేతులు సబ్బుతో కడుక్కోకపోవడం - శానిటైజర్ల వాడకం అందుబాటులో లేకపోవడం కారణంగా కేసులు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణ ప్రాంతాలు కూడా ఉన్నాయి.

సామూహిక నీటి సేకరణ - సామూహిక మరుగుదొడ్లు ఉపయోగించే ప్రాంతాల్లో ఈ వైరస్ లాంటి వాటిని అరికట్టడం చాలా కష్టం. అలాంటి ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించడం కష్టమే.

నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం దేశంలో దేశ గ్రామీణ ప్రాంతాల్లో 48.60 శాతం మందికి తాగునీటి సదుపాయం అందుబాటులో లేదు. 30 శాతం మంది తాగునీటి కోసం ప్రభుత్వ నీటి వనరులపై ఆధారపడి బతుకుతున్నారు.

దేశంలో ఎంత మంది తాగునీటికి - మరుగుదొడ్లకు కమ్యూనిటీపై ఆధారపడి ఉన్నారో - వారిలో ఎంత మంది వైరస్‌ బారిన పడే అవకాశం ఉందో అన్న అంశాలను విశ్లేషించి దేశంలో దాదాపు పదికోట్ల మంది ప్రజలు అలా వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.