Begin typing your search above and press return to search.

నీటి కొర‌త‌తో చెన్నై ఐటీ సంస్థ‌ల్లో క్యాంటీన్ల మూసివేత‌!

By:  Tupaki Desk   |   16 Jun 2019 4:57 AM GMT
నీటి కొర‌త‌తో చెన్నై ఐటీ సంస్థ‌ల్లో క్యాంటీన్ల మూసివేత‌!
X
కొన్నేళ్ల క్రితం తీవ్ర‌మైన నీటి ఎద్ద‌డితో మ‌హారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల‌కు నీళ్ల‌ను రైళ్ల‌లో స‌ర‌ఫ‌రా చేసిన ఉదంతాన్ని చూశాం. తాజాగా ఇప్పుడా ద‌రిద్ర‌మైన ప‌రిస్థితి త‌మిళ‌నాడు రాష్ట్ర రాజ‌ధాని చెన్నై మ‌హాన‌గ‌రానికి దాపురించింది. అడుగంటిన భూగ‌ర్భ జ‌లాలు.. జాడ లేని వ‌రుణుడితో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది.

చెన్నైకి నీటిని అందించే పూండి.. పుళ‌ల్.. చోళ‌వ‌రం.. చెంబ‌రంబాక్కం.. రెడ్ హిల్స్.. వీరాణం త‌దిత‌ర జ‌లాశ‌యాలు అడుగంటిపోయాయి. దీనికి తోడు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కండ‌లేరు జిలాలు కూడా రాక‌పోవ‌టంతో నీటి స‌మ‌స్య మ‌రింత పెరిగిపోయింది. చెన్నైలోని నీటి ఎద్ద‌డి తీవ్ర‌త ఎంతంటే.. ఐటీ కంపెనీల్లోని క్యాంటీన్ల‌ను మూసేశారు.

అంతేకాదు.. ప్ర‌తి ఒక్క ఉద్యోగి త‌న‌కు అవ‌స‌ర‌మైన నీటిని.. భోజ‌నాన్ని వారే తెచ్చుకోవాల‌న్న రూల్ పెట్టేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెద్ద పెద్ద హోట‌ళ్లు త‌మ మెనూలో భోజ‌నం ఎత్తేశాయి. నీరు అధికంగా అవ‌స‌ర‌మ‌య్యే ఆహార ప‌దార్థాల్ని వండ‌టం నిలిపేశారు. నీటి స‌మ‌స్య తీరే వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితిని కొన‌సాగిస్తామ‌ని స‌ద‌రు హోట‌ళ్లు చెప్పేస్తున్నాయి.

ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ప్ర‌భుత్వం క‌నీసం ప‌ట్ట‌న‌ట్లుగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. నీటి తీవ్ర‌త ఇంత‌లా ఉంటే ప్ర‌భుత్వం స్పందించ‌లేదంటూ ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. నీటి ఎద్ద‌డి మీద స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని మ‌ద్రాసు హైకోర్టు పేర్కొంది. చెన్నై నీటి ఎద్ద‌డిని అంతో ఇంతో ప‌రిష్క‌రించేందుకు 40 మిలియ‌న్ లీట‌ర్ల నీటిని జోలార్ పేట రైల్వేస్టేష‌న్ నుంచి చెన్నైకి పంపుతున్నారు. చెన్నై వెళ్లాల‌న్న ప్లాన్ లో ఉన్నా.. కాస్త ఈ ఇష్యూను మ‌న‌సులో పెట్టుకొని వెళితే మంచిది.