Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల వివాదం రేగినట్టేనా?

By:  Tupaki Desk   |   13 May 2020 4:00 AM GMT
తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల వివాదం రేగినట్టేనా?
X
తెలుగు నేల విభజన జరిగాక ఏపీ, తెలంగాణలుగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల వివాదం రేగింది. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా... పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులతో జల వివాదాలు కొనసాగగా... ఇప్పుడు ఆ వివాాదాలన్నీ పక్కకెళ్లిపోగా... ఇప్పుడు కొత్తగా తెలుగు రాష్ట్రాల మధ్యే నీటి వివాదాలు రేకెత్తుతున్నాయి. ఈ వివాాదాలన్నీ కూడా కేవలం ఏపీలోని రాయలసీమకు చెందిన కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపైనే రేగుతుండటం నిజంగా ఆసక్తికరమేనని చెప్పాలి. ఎందుకంటే... తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా పోతిరెడ్డి పాడు అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రల మధ్య చిచ్చు రేపింది. తాజాగా తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల మధ్య మరోమారు పోతిరెడ్డిపాడు కారణంగానే చిచ్చు రేగింది. అసలు ఈ చిచ్చు ఏ మేర సాగనుందన్నది కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.

అసలు ఈ వివాదానికి కారణంగా నిలుస్తున్న కారణమేంటన్న విషయానికి వస్తే.. పోతిరెడ్డిపాడు నిల్వ సామర్థ్యాన్ని మరో 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు ప్రణాళిక రచించింది. ‘సీమ దుర్భిక్ష’ పేరిట చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో శ్రీశైలం జలాశయంలో 881 అడుగులకు పైగా నీరు చేరిన సమయంలో కర్నూలు జిల్లాలోకి వచ్చే బ్యాక్ బాటర్ ను పోతిరెడ్డిపాడుకు మళ్లించి ఆ నీటితో రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చాలన్నది జగన్ సర్కారు ఉద్దేశం. అయితే ఏళ్ల తరబడి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వస్తున్న తెలంగాణ ఇప్పుడు కూడా గతంలో మాదిరిగానే ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ కృష్ణా నీటి యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. కృష్ణా ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పునకు ఈ ప్రాజెక్టు విరుద్ధమని, తక్షణమే ఈ ప్రాజెక్టు చేపట్టకుండా ఏపీ సర్కారును నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరింది.

అయితే ఈ ప్రాజెక్టు కృష్ణా ట్రిబ్యూనల్ కు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని,.. బోర్డు తమకు కేటాయించిన మేర నీటితోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే... అది కూడా కర్నూలు జిల్లాలోకి వచ్చే బ్యాక్ వాటర్ నుంచే తాము నీటిని పోతిరెడ్డిపాడుకు తరలిస్తామని ఆయన వాదించారు. అంతేకాకుండా ఎప్పుడైనా శ్రీశైలంలో 881 అడుగుల మేర నీటిమట్లం కనీసం పది రోజులైనా ఉంటుంధా? అని కూడా ఆయన ఓ సరికొత్త వాదనను ప్రస్తావించారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే తక్కువ నీరున్నప్పుడు తెలంగాణ ఎన్ని సార్లు నీటిని తీసుకోలేదని కూడా జగన్ ప్రశ్నించారు. అయినా ఏనాడైనా తాము తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం తెలిపామా? అసలు మా పరిధిలోకి వచ్చే నీటిని మేం వాడుకుంటే మీకేం బాధ అంటూ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.

అయితే కృష్ణా ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పు మేరకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనేనని తెలంగాణ వాదిస్తోంది. ఈ మేరకు బోర్డుకు చాలా అంశాలను ప్రస్తావిస్తూ ఇప్పటికే ఫిర్యాదు కూడా చేసింది. కరోనా వేళ సరికొత్తగా తెరమీదకు వచ్చిన ఈ వివాదంపై బుదవారం కృష్ణా బోర్డు విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు ఇప్పటికే తెలంగాణ సర్కారు పూర్తి స్థాయిలో సన్నద్ధం అయినట్టే కనిపిస్తోంది. అయితే తమ వాదనను కూడా కాస్తంత గట్టిగానే వినిపించేందుకు జగన్ కూడా తన అదికార యంత్రాంగానికి మంగళవారమే దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ విచారణలో రెండు రాష్ట్రాల వాదనలు విననున్న బోర్డు ఎవరి వాదనకు జై కొడుతుందో చూడాలి.