Begin typing your search above and press return to search.

బ్లాక్ మ‌నీ ఎన్ని విధాలుగా మార్చారంటే...!

By:  Tupaki Desk   |   13 Dec 2016 6:34 AM GMT
బ్లాక్ మ‌నీ ఎన్ని విధాలుగా మార్చారంటే...!
X
రూ. 500 - రూ.1000 నోట్ల రద్దు నల్లధనం అంతానికి తీసుకున్న చర్యగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ చెప్తున్న చ‌ర్య బ్రహ్మాండమైన విజయం సాధించింది! కాకపోతే.. ఆ నల్లధనం అంతా తెల్లధనంగా మారిపోయి.. ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించడం వ‌ల్ల అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆలయాలకు ఇచ్చిన విరాళాలు మొదలుకుని.. రియల్‌ ఎస్టేట్ వ్యాపారాలు - కాలేజీ ఫీజులు.. ప్రత్యేకించి నగల దుకాణాలు నల్లధనాన్ని తెల్లగా నిగనిగలాడిస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఏం చేసినా.. మా మార్గాలు మాకున్నాయని కాలరెగరేస్తున్నారు హవాలా వ్యాపారులు! పెద్ద నోట్ల ర‌ద్దు నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకులు - ఏటీఎంల ముందు బారులు తీరుతుంటే.. అదే సమయంలో హవాలా వ్యాపారులు చెలరేగిపోయి నల్లధనాన్ని తెల్లగా మార్చివేస్తున్న ఉదంతాలు మ‌నం ఎన్నో చూస్తున్నాం. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఈ ప్రయత్నాల్లో ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అగ్రభాగంలో ఉండగా - మహారాష్ట్ర - హర్యానా - పంజాబ్ - ఢిల్లీ తదితర రాష్ట్రాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. నల్లధనం కలిగి ఉన్నవారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, పేదలు - నిజాయతీ పరులు మాత్రం ప్రశాంతంగా నిద్రిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ చెప్తున్నా.. వాస్తవానికి నల్ల ధనవంతులు హాయిగా నిద్రపోతుంటే.. రేపటి అవసరాలకు డబ్బు సమకూరేదెలాగన్న ఆందోళనతో పేదలు - మధ్యతరగతి ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది.

పెద్ద నోట్లు రద్దు చేసే నాటికి ఆర్థిక వ్యవస్థలో సుమారు 15.44 లక్షల కోట్లు చెలామణిలో ఉన్నాయి. అందులో ఇప్పటికే 12లక్షల కోట్ల పైచిలుకు దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. మిగిలిన రెండు లక్షల్లో అధికభాగం రానున్న రోజుల్లో బ్యాంకులకు చేరుతుందని ఆర్బీఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ సొమ్ము కూడా బ్యాంకులకు చేరిపోతే దాదాపు 4-5 లక్షల కోట్లు ఉంటుందని చెప్తున్న నల్లధనం సంగతేంటి? విశేషం ఏమిటంటే.. ప్రభుత్వం చెప్తున్న సదరు నాలుగైదు లక్షల కోట్ల నల్లధనం కూడా దర్జాగా తెల్లధనంగా మారిపోతూ.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెక్కిరిస్తున్నది. సవాలక్ష మార్గాల్లో అనేక మంది అక్రమార్కులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని నిశ్చింతగా తెల్లగా మార్చివేసుకుంటూ మోదీ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్నారు. అక్రమ పద్ధతుల్లో నల్లధనాన్ని మార్చుకునేవారిపై తీవ్ర చర్యలు ఉంటాయని ప్రభుత్వం భీకర హెచ్చరికలు చేసినా.. అప్పటికే సమయం మించిపోయింది. నల్లధనం అనేక రూపాలుగా మారుతూ.. చివరికి తెల్లధనం అయిపోతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త అమియా బాగ్జి వ్యాఖ్యానించారు.

దేశంలో నల్లధనాన్ని అడ్డుకునేందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 ఉన్నది. దీనిని పటిష్ఠం చేసేందుకు గతంలో అనేక సవరణలు కూడా జరిగాయి. అయినా.. నల్లధనం వ్యాపారంలో పండిపోయిన వారు వాటన్నింటికీ కూడా ప్రత్యామ్నాయాలు కనిపెట్టి.. తమ హవాలా వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంగా నిరాఘాటంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా పెద్ద నోట్ల రద్దుతో వారికి చేతి నిండా పని దొరికినట్టయిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఒక విధంగా ఈ నిర్ణయం వారికి ఒక మంచి - కొత్త అవకాశం అని చెప్తున్నారు. చిన్న చిన్న మొత్తాల్లో నల్లధనాన్ని మార్చుకునేందుకు నగదుతో సంబంధం ఉండే క్యాసినోలు - ఈవెంట్ మేనేజ్‌ మెంట్ కంపెనీలు - బార్లు - నైట్‌ క్లబ్‌ లు తదితరాలు - విలువైన రాళ్లు - వజ్రాలు వంటివాటిని ఎగుమతి/దిగుమతి చేసుకునే కంపెనీలు - చిట్‌ ఫండ్ కంపెనీలు తదితర వ్యాపారాలు బాగా ఉపకరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని అనేక ఆలయాలకు హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. తిరుమలలో నోట్ల రద్దు తర్వాతి తొలి పది రోజుల్లో 30.36 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. ఇతర దేవాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మరి ఈ సొమ్ము తెల్లగా ఎలా మారుతుంది? దేవాలయాలకు వచ్చే విరాళాలను గుప్త దానాలుగా మేనేజ్‌ మెంట్లు స్వీకరిస్తాయి. వీటిలో కొంత సొమ్ము కమీషన్ కింద మినహాయించుకుని కొత్త కరెన్సీని వారికి అందజేస్తాయి. కొన్ని చోట్ల 50శాతం కమీషన్‌ పై విరాళాలు స్వీకరిస్తున్నట్టు తెలుస్తున్నది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడంలో రియల్‌ ఎస్టేట్ సంస్థలు కీలక పాత్ర పోషించాయని - పోషిస్తున్నాయని తెలుస్తున్నది. రియల్‌ ఎస్టేట్ సంస్థలు కూలీలకు చెల్లింపులు తదితరాల కోసం భారీ మొత్తంలో నగదు అట్టిపెట్టుకునేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. దీనిని ఉపయోగించుకున్న రియల్టర్లు.. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో రద్దయిన నోట్లను 20 నుంచి 40శాతం కమీషన్‌ పై తీసుకుని.. ఆ సొమ్మును తమ వద్ద ఉన్న సొమ్ముగా చూపుతున్నారు. ఇంజినీరింగ్ - మెడికల్ - ఎంబీఏ కోర్సులు ఆఫర్ చేసే పలు ఉన్నత విద్యాసంస్థలు కూడా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. ఫీజుల చెల్లింపుల పుస్తకాలను మార్చివేసిన కాలేజీల యాజమాన్యాలు.. వెనకటి తేదీలతో తమ విద్యార్థులు చెల్లించిన ఫీజులుగా నల్లధనాన్ని చేరుస్తున్నాయి. ఆ మొత్తాన్ని విద్యార్థులు చెల్లించిన ఫీజులుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసేస్తున్నాయి.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొన్ని జ్యువెల్లరీ షాపులలో దాదాపు రూ.500 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్లు తీసుకుని.. పాత తేదీలతో ఆభరణాలు కొనుగోలు చేసినట్టు బిల్లులు ఇచ్చేశారు. ఇదే మొత్తాలను దుకాణదారులు ఒక పద్ధతి ప్రకారం బ్యాంకుల్లో జమ చేశారు. ఒక్క హైదరాబాద్‌ లోని ఒక దుకాణంలోనే వంద కోట్ల విలువైన పాత నోట్లు తెల్లగా మారిపోయాయంటే.. ఇక దేశంలోని ఇతర నగల దుకాణాల్లో ఎంత మొత్తంలో నగదు మారి ఉంటుంది? పేదలను ప్రలోభపెట్టి.. కొన్ని కంపెనీలు తమ వద్ద పని చేసే కార్మికులతోపాటు రోజువారీ కూలీలు - వ్యవసాయ కార్మికులను కమీషన్ ప్రాతిపదికన బ్యాంకులకు పంపి.. పాత నోట్లుడిపాజిట్ చేయించి.. కొత్త నోట్లు పొందారని వార్తలు వచ్చాయి. లూధియానాలో బజాజ్ అండ్ సన్స్ యాజమాన్యం దాదాపు 2వేల మందిని ఇదే పనిపై బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబెట్టింది. కొన్ని కంపెనీలు తమ కార్మికులకు వేతనాలు కూడా రద్దయిన పెద్ద నోట్ల రూపంలోనే ఇచ్చాయి.

ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని పెట్రోల్ బంకుల వద్ద కూడా పెద్ద మొత్తంలో పెద్ద నోట్లు తెల్లగా నిగనిగలాడాయి. ప్రత్యేకించి ట్రావెల్స్ సంస్థలు పెద్ద నోట్లను ఉపయోగించి ఇంధనం నింపుకొన్నాయి. ఇతర నోట్లకు పెట్రోలు పోసినా.. ఆ మొత్తం స్థానంలో పాత నోట్లను చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక బ్యాంకర్ల లీలలు అన్నీ ఇన్నీ కావు. తమవారు అనుకున్నవాళ్ల నుంచిపాత నోట్లను తీసుకుని కోరుకున్నంత కొత్త నగదును అందిస్తున్న ఉదంతాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. బడాబాబుల వద్ద దర్శనమిస్తున్న నోట్ల కట్టలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పార్టీ ప్రచారంలో పాల్గొన్నవారికి వివిధ పార్టీలు రోజుకు రూ.2000 నుంచి రూ.2500 వరకు పాత నోట్ల రూపంలో చెల్లించాయి. వీటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా పేదలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వీలుంది. అంటే.. మోదీ చెప్తున్న నల్లధనం ఇప్పటికే దాదాపు అంతమైందన్నమాట! కాకపోతే.. రూపు మార్చుకుని!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/