Begin typing your search above and press return to search.

ఈ వీడియో పోస్టు చేయటం ఇష్టం లేదు.. తీవ్రత తెలియాలంటే తప్పలేదు

By:  Tupaki Desk   |   17 April 2021 10:09 AM GMT
ఈ వీడియో పోస్టు చేయటం ఇష్టం లేదు.. తీవ్రత తెలియాలంటే తప్పలేదు
X
కరోనా తీవ్రత ఎలా ఉంది? రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ప్రశ్న గంభీరత పెరిగిపోతోంది. మొదట్లో పెద్దగా పట్టించుకోని వారు సైతం ఇప్పుడు అందుకు భిన్నంగా రియాక్టు అవుతున్నారు. చూస్తుండగానే కేసుల వ్యాప్తి ఎక్కువ కావటమే కాదు.. పలు ఇబ్బందికరపరిస్థితులు తలెత్తుతున్నాయి.

ఇలాంటివేళ.. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. మానవత్వంతో సాయం చేయాల్సిన అవసరం ఉంది. గుజరాత్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కావొచ్చు.. అక్కడి ప్రజల్లో లోపించిన అవగాహన కావొచ్చు.. కేసులు భారీగా పెరగటమే కాదు.. మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతో.. దహన సంస్కారాల విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ రాష్ట్రాలతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో అంత దారుణమైన పరిస్థితి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ.. తరచి చూస్తే.. కొన్నిచోట్ల అలాంటి ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. అందుకు సంబంధించిన వీడియోను మేం ఇక్కడ షేర్ చేశాం. వాస్తవానికి ఈ వీడియోను షేర్ చేయటం ఇష్టం లేదు. కారణంగా.. భయాందోళనలకు గురి చేయటం.. సంచలనంగా మార్చటం మా ఉద్దేశం కాదు.

మాయదారి కరోనా ఎలాంటి దారుణ పరిస్థితుల్ని తీసుకొస్తుందన్న విషయం మీద అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఏముందిలే అని.. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు తమకు తాము హాని చేసుకోవటమే కాదు.. తమ ఇంట్లో వారిని కూడా ముప్పులోకి నెట్టేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ విషయాన్ని తెలియజేసేందుకే ఈ వీడియోను షేర్ చేస్తున్నాం. మీరు చూస్తున్న వీడియో మరెక్కడిదో కాదు.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా నమాత్ పల్లి గ్రామంలో కరోనాతో బాలమ్మ అనే మహిళ మరణించారు. దీంతో..ఆమెను తీసుకెళ్లేందుకు అలా ప్రొక్లెయిన్ వినియోగించారు. కేసులు తక్కువగా ఉన్నప్పుడే ఇలా ఉంటే.. కేసుల తీవ్రత పెరిగితే రాబోయే రోజుల్లో మరెన్ని దారుణ పరిస్థితులు చూడాల్సి వస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే.. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది.