Begin typing your search above and press return to search.

400 కోట్లు రావాల్సింది..ఒక కోటి వ‌చ్చింది

By:  Tupaki Desk   |   8 April 2020 1:30 AM GMT
400 కోట్లు రావాల్సింది..ఒక కోటి వ‌చ్చింది
X
క‌రోనా వైర‌స్ ధాటికి రెండు వారాల కింద‌ట్నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌ల‌వుతోంది. ప్ర‌ధాని లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డానికి ముందే తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. అప్ప‌ట్నుంచి ఏ కంపెనీ న‌డ‌వ‌ట్లేదు. దుకాణాలేవీ తెరుచుకోవ‌ట్లేదు. మ‌ద్యం షాపులూ నిలిచిపోయాయి. ప‌రిశ్ర‌మ‌లు ఆగిపోయాయి. దీంతో ప్ర‌భుత్వ ఆదాయం పూర్తిగా ప‌డిపోయింది. ద‌క్షిణాదిన ఆర్థికంగా చాలా ముందుండే తెలంగాణ‌.. ఇప్పుడు నిధుల కొర‌త‌తో క‌ట‌క‌ట‌లాడుతోంది. ఈ నెల ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 50 శాతం జీతాలు కూడా ఆపేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఐతే విధి లేని ప‌రిస్థితుల్లోనే జీతాల్లో కోత విధించాల్సి వ‌చ్చింద‌ని.. ప్ర‌భుత్వ ఆదాయం పై ప‌డ్డ దెబ్బ అలాంటి లాంటిది కాద‌ని అంటున్నారు కేసీఆర్.

లాక్ డౌన్ కార‌ణంగా తెలంగాణ ప్ర‌భుత్వ ఆదాయం ఎలా ప‌డిపోయిందో తాజా ప్రెస్ మీట్లో సీఎం వెల్ల‌డించారు. వివిధ రంగాల నుంచి తెలంగాణ ప్ర‌భుత్వానికి రోజుకు రూ.400 కోట్ల నుంచి రూ.440 కోట్ల వ‌ర‌కు ఆదాయం వ‌చ్చేద‌ని.. అలాంటిది రోజువారీ ఆదాయం రూ.కోటికి ప‌డిపోయింద‌ని కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్లో ఈ ఆరు రోజుల‌కు క‌నీసం 2400 కోట్ల ఆదాయం రావాల్సింద‌ని.. కానీ రూ.6 కోట్ల‌కు ఆదాయం ప‌డి పోయింద‌ని చెప్పారు. మ‌న ప‌రిస్థితే ఇలా ఉంటే.. దేశం ప‌రిస్థితి ఏంటో అంచ‌నా వేయొచ్చ‌ని కేసీఆర్ అన్నారు. క‌రోనా ధాటికి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కోలుకోలేని దెబ్బ త‌గిలింద‌ని.. ఐతే ఎకాన‌మీని మ‌ళ్లీ గాడిన పెట్టొచ్చ‌ని, కానీ క‌రోనా వ‌ల్ల ప్రాణాలు పోతే వాటిని తీసుకురాలేమ‌ని.. అందుకే లాక్ డౌన్ పొడిగించక త‌ప్ప‌ద‌ని కేసీఆర్ అన్నారు. లాక్ డౌన్ కొన‌సాగించ‌క‌ పోతే శ‌వాల గుట్ట‌లు చూడాల్సి వ‌స్తుంద‌ని కేసీఆర్ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.