Begin typing your search above and press return to search.

ర‌హ‌నే.. అన్ని క‌ష్టాలు ప‌డి క్రికెట‌ర్ గా ఎదిగాడ‌ట‌!

By:  Tupaki Desk   |   2 March 2020 11:30 PM GMT
ర‌హ‌నే.. అన్ని క‌ష్టాలు ప‌డి క్రికెట‌ర్ గా ఎదిగాడ‌ట‌!
X
టీమిండియా టెస్టు జ‌ట్టు వైస్ కెప్టెన్ అజింక్య ర‌హ‌నే. అత్యంత ట్యాలెంటెడ్ టెస్టు బ్యాట్స్ మ‌న్ల‌లో ఒక‌డు. ప్ర‌స్తుత న్యూజిలాండ్ టెస్టు సీరిస్ లో ర‌హ‌నే పూర్తిగా విఫ‌లం అయ్యాడు. రెండు మ్యాచ్ ల‌లోనూ స‌రిగా ఆడ‌లేదు. మిగ‌తా బ్యాట్స్ మెన్ కూడా అందుకు మిన‌హాయింపు కాదు. జ‌ట్టు మొత్తంగా విఫ‌లం అయ్యింది. రెండు మ్యాచ్ ల‌లోనూ ఓడిపోయి, న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆ సంగ‌త‌లా ఉంటే.. ర‌హ‌నే తన తాజా ఇంట‌ర్వ్యూలో త‌న పాత విష‌యాలు కొన్ని చెప్పాడు.

అందులో ముఖ్య‌మైన‌ది త‌ను ఎదిగి వ‌చ్చిన తీరు. త‌న చిన్న‌ప్పుడు ప్రాక్టీస్ కోసం ప్ర‌తి రోజూ ఆరు నుంచి ఎనిమిది కిలోమీట‌ర్ల దూరం న‌డిచే వాడిని అని ర‌హ‌నే చెప్పాడు. ఆ మాత్రం న‌డ‌వ‌డం పెద్ద క‌థ కాక‌పోవ‌చ్చు. అయితే తమ ఆర్థిక ప‌రిస్థితి స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే అలా గ్రౌండ్ కు న‌డిచివెళ్లాల్సి వ‌చ్చింద‌ని ర‌హ‌నే చెప్పాడు.

ప్ర‌తి రోజూ రిక్షాలో వెళ్లాలంటే.. డ‌బ్బులు ఖ‌ర్చు అవుతాయి, ఆ మాత్రం డ‌బ్బు త‌మ వ‌ద్ద ఉండేది కాద‌ని, రిక్షాలో వెళ్ల‌డానికి కూడా డ‌బ్బులు లేక ఎనిమిది కిలోమీట‌ర్ల దూరం న‌డిచి ప్రాక్టీస్ సెష‌న్స్ కు హాజ‌ర‌య్యే విష‌యాన్ని ర‌హ‌నే వివ‌రించాడు. ప్ర‌తి రోజూ త‌న త‌ల్లి త‌న‌తో పాటు వ‌చ్చేద‌ని, ఆమె త‌న క్రికెట్ కిట్ మోసుకుంటూ వ‌చ్చేద‌ని.. త‌ను ఒక్క‌డే వెళితే కిట్ మోయ‌డం క‌ష్టం అవుతుంద‌ని ఆమె కూడా వ‌చ్చేద‌ని ర‌హనే భావోద్వేగ భ‌రితంగా వివ‌రించాడు. త‌ను క్రికెట‌ర్ అయ్యానంటే అందుకు కార‌ణం త‌న త‌ల్లిదండ్రులే అని ర‌హ‌నే గ‌ర్వంగా చెప్పాడు.