Begin typing your search above and press return to search.

మాకు కులం, మ‌తం వ‌ద్దు: హైకోర్టుకు దంప‌తుల వినూత్న డిమాండ్‌

By:  Tupaki Desk   |   28 April 2020 9:30 AM GMT
మాకు కులం, మ‌తం వ‌ద్దు: హైకోర్టుకు దంప‌తుల వినూత్న డిమాండ్‌
X
జ‌న్మ ధ్రువ‌ప‌త్రం ఇప్పుడు అంద‌రికీ కావాల్సిన ప‌త్రం. మ‌న జ‌న్మ వివ‌రాల‌ను తెలిపే ప‌త్రం అప్ప‌ట్లో పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అన్నింటికి ఆధార్ కార్డు మాదిరి జ‌న‌న ధ్రువ‌ప‌త్రం (డేటాఫ్ బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌) అడుగుతున్నారు. అయితే ఓ జంట తెలంగాణ హైకోర్టుకు వినూత్న, ఆద‌ర్శ‌వంత‌మైన‌ డిమాండ్ చేశారు. వారి బిడ్డ‌కు కులం, మ‌తం లేని జ‌న‌న ధ్రువ‌ప‌త్రం కావాల‌ని, అది మంజూరు చేయ‌డానికి ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించారు.

సాధారణంగా బర్త్‌ సర్టిఫికెట్‌లో ఏముంటాయి. పుట్టిన తేదీతో పాటు తండ్రి పేరు, కులం, మతం లాంటి వివ‌రాలు ఉంటాయి. అయితే ఆ దంపతులు ఇప్పటికే తమ పిల్లల‌కు ఎలాంటి మతం, కులం లేకుండానే బర్త్‌ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. పిల్లలను చేర్పించిన పాఠ‌శాల‌ల్లో వారి కులం, మతం నమోదు కోసం వి‌వ‌రాలు అడుగుతున్నారు. వాటి వ‌ల‌న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అంశంపైనే హైదరాబాద్‌కు చెందిన దంప‌తులు డేవిడ్‌, రూప తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

త‌మ‌ది కులాంతర, మతాంతర వివాహమ‌ని తెలిపారు. జ‌న‌న ధ్రువ‌ప‌త్రంలో (బర్త్‌ సర్టిఫికెట్)‌లో కుటుంబం మతం అనే కాలమ్ ఉన్నా తాము రాయ‌కుండా ఖాళీగా వ‌దిలేశామ‌ని, అందులో ఏదో ఒక‌టి రాస్తేనే ధ్రువ‌ప‌త్రం ఇస్తామని అధికారులు చెబుతున్నారని హైకోర్టుకు విన్న‌వించారు. ఈ విష‌య‌మై తాము హైదరాబాద్‌ కలెక్టర్‌ను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఈ విష‌య‌మై కోరుతూ త‌మ బిడ్డకు కులం, మతం లేకుండా జనన ధృవీకరణ పత్రం కావాలని కోరుతున్న హైకోర్టులో వేసిన పిల్‌లో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌ను హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించించింది. ఈ క్ర‌మంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ పిటీష‌న్‌పై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్న‌ట్లు తెలంగాణ హైకోర్టు ప్ర‌క‌టించింది.

అయితే ఆ దంప‌తులు ఏ ఉద్దేశంతో ఆ విధంగా ధ్రువ‌ప‌త్రం అడుగుతున్నారో కానీ, భ‌విష్య‌త్ స‌మాజానికి ఒక మార్గ‌ద‌ర్శ‌కం ఉండేలా.. ఇప్ప‌టి నుంచే పిల్ల‌ల‌కు కులం, మ‌తం అనేవి రుద్ద‌కుండా ఉంటాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. కులం, మ‌తం అనేవి పేర్లుగా ఉంటే బావుంటాయి కానీ అవి ఇత‌ర రూపాల్లో ఉంటే మాత్రం స‌మాజానికి చేటు అని పేర్కొంటున్నారు.