Begin typing your search above and press return to search.

దాయాదుల ఎపిసోడ్ లో ట్రంప్ మాట‌లే నిజాల‌య్యాయ్!

By:  Tupaki Desk   |   1 March 2019 5:18 AM GMT
దాయాదుల ఎపిసోడ్ లో ట్రంప్ మాట‌లే నిజాల‌య్యాయ్!
X
భార‌త్ - పాక్ ల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త ప‌రిస్థితులకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాన్ని ప్ర‌స్తావించాల్సిందే. పుల్వామా ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భార‌త్ మెరుపుదాడులు నిర్వ‌హించ‌టం.. ఆ త‌ర్వాత భార‌త గ‌గ‌న‌త‌లంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకురావ‌టం.. వాటిని త‌రిమికొడుతూ అభినంద‌న్ వ‌ర్ద‌న్ అనే పైలెట్ పాక్ లో చిక్కుకుపోవ‌టం.. అక్క‌డి సైనికులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకోవ‌టం తెలిసిందే.

దీంతో ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పీక్స్ కు వెళ్ల‌ట‌మే కాదు.. యుద్ధం ఖాయ‌మ‌న్న భావ‌న ప‌లువురికి క‌లిగింది. ఈ ప‌రిణామాల‌పై భార‌త మీడియాలో అత్య‌ధికులు యుద్ధ మేఘాలు అంటూ శీర్షిక‌లు పెట్టేశారు కూడా. ఇలాంటి ఉద్రిక్త‌ల వేళ‌.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నోటి నుంచి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి వ‌చ్చింది.

త్వ‌ర‌లోనే శుభ‌వార్త వింటామంటూ భార‌త కాల‌మానం ప్ర‌కారం గురువారం ఉద‌యం వేళ‌లోనే ట్రంప్ నోటి నుంచి రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అంటే.. దాయాదుల మ‌ధ్య నెల‌కొన్న ఘ‌ర్ష‌న వాతావ‌ర‌ణాన్ని నివారించేందుకు ఆయ‌న కీల‌క‌భూమిక పోషించారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. నిజానికి ఈ ఎపిసోడ్ లో భార‌త్ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేయ‌టానికి రెండు రోజుల ముందు కూడా ట్రంప్ ఇదే త‌ర‌హాలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

పుల్వామా ఉగ్ర‌దాడుల‌పై భార‌త్ సీరియ‌స్ గా ఉంద‌ని.. ఇందుకు ప్ర‌తిగా భార‌త్ ఏదైనా చేసేందుకుసిద్ధంగా ఉంద‌న్న మాట ట్రంప్ నోటి నుంచి వ‌చ్చింది. ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంటుంద‌న్న ఆయ‌న మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే మోడీ స‌ర్కారు మెరుపుదాడుల‌కు ప్లాన్ చేయ‌టం.. వాటిని విజ‌యవంతంగా అమ‌లు చేయ‌టం తెలిసిందే.

దీంతో.. ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు భారీగా పెరిగాయి. యుద్ధం ఖాయ‌మా? అన్న సందేహాలు ప‌లువుర‌కి క‌లుగుతున్న వేళ‌లో ట్రంప్ ఎంట్రీ ఇవ్వ‌టం.. ఇరు దేశాల నుంచి గుడ్ న్యూస్ వింటాన‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

ట్రంప్ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన కొద్ది గంట‌ల్లోనే కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం ఇరు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పాక్ యుద్ధ విమానాలు భార‌త్ లోకి ప్ర‌వేశించే ప్ర‌య‌త్నం చేయ‌టం.. వాటిని భార‌త వాయుసేన తిప్పి కొట్టింది. ఇదిలా జ‌రుగుతున్న వేళ‌లోనే.. పాక్ ప్ర‌భుత్వం పార్ల‌మెంటు స‌మావేశంలో త‌మ వ‌ద్ద బంధీగా ఉన్న భార‌త పైల‌ట్.. వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ తాము శుక్ర‌వారం భార‌త్ కు పంపుతున్న‌ట్లుగా పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ స్వ‌యంగా పేర్కొన్నారు. దీంతో.. ఇరు దేశాల మ‌ధ్య‌నున్న ఉద్రిక్త‌త‌లు ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్లైంది. దీన్ని త‌మ విజ‌యంగా ఇరు దేశాలు ప్ర‌క‌టించుకున్నాయి. అయితే. ఇందుకు కీల‌కంగా ట్రంప్ వ్య‌వ‌హ‌రించారా? త‌న పాత్ర బ‌య‌ట‌కురాకుండా ఆయ‌న జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే.. జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌కు సంబంధించిన వ్యాఖ్య‌ల్ని ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భంగా చేశారా? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌గా మారింది.