Begin typing your search above and press return to search.

మోడీ వ‌దిలిన గుర్రాన్ని బంధించాం....!

By:  Tupaki Desk   |   24 May 2018 5:09 AM GMT
మోడీ వ‌దిలిన గుర్రాన్ని బంధించాం....!
X
అనేక ఉత్కంఠ‌త‌ల‌కు తెర‌ప‌డి...కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్‌ డీ కుమారస్వామి బుధవారం సాయంత్రం ప్రమాణం చేశారు. బెంగళూరులోని విధానసౌధ (అసెంబ్లీ) ప్రాంగణంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కుమారస్వామితో గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ఆయన తర్వాత ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత - పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణం చేశారు. తెల్లని లుంగీ - ఖద్దరు అంగీ ధరించిన కుమారస్వామి దైవసాక్షిగా - కన్నడనాడు ప్రజల సాక్షిగా కన్నడంలో ప్రమాణం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2006 ఫిబ్రవరి 2న బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారి సీఎం అయిన కుమారస్వామి 2007 అక్టోబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు. శుక్రవారంనాడు అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని తర్వాతే మంత్రివర్గ ఏర్పాటు ఉండనుంది.

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అశ్వమేథయాగంలో మోడీ వదలిన గుర్రాన్ని కాంగ్రెస్-జేడీఎస్ బంధించాయని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ``మోడీ-అమిత్‌ షాలు అశ్వమేధ యాగంలో వదిలిన విజయాశ్వాన్ని బంధించడమే మా లక్ష్యమని ఉత్తర్‌ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలప్పుడే నేను చెప్పాను. ఈరోజు కాంగ్రెస్-జేడీఎస్ సంయుక్తంగా ఆ గెలుపు గుర్రాన్ని కట్టడి చేశాయి. మున్ముందు మోడీ దగ్గరకు అమిత్‌ షా జీవచ్ఛవంలాంటి ఈ అశ్వాన్ని తీసుకుని వెళ్లాల్సిందే`` అని ఆయన చెప్పారు. పరిస్థితులరీత్యా జన్మించిన శిశువుగా ఆయన తనను తాను అభివర్ణించుకున్నారు. జాతీయ ప్రయోజనాల కోసమే తాము కాంగ్రెస్‌ తో చేతులు కలిపామని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో పరిమితులుంటాయని, భాగసామ్య పక్షాల ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కుమార‌స్వామి తెలిపారు. ``ఇరుపార్టీలూ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను కలిపి నెరవేర్చాల్సిన బాధ్యత సంకీర్ణ ప్రభుత్వంపై ఉంటుంది. రైతుల రుణమాఫీ నిర్ణయంలో వెనుకడుగు వేయబోము. రాష్ట్ర ఆర్థికస్థితి కాస్త మెరుగుపడ్డాక తప్పకుండా రుణమాఫీ ఉంటుంది`` అని కుమారస్వామి చెప్పారు. తమ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందోనని ప్రజలు సందేహిస్తున్నారని, అయితే ప్రభుత్వ పనితీరుతో అవి క్రమంగా తొలిగిపోతాయని కుమారస్వామి పేర్కొన్నారు.

కాగా, కుమారస్వామి ప్రభుత్వం ఈనెల 25న (శుక్రవారం) విశ్వాసపరీక్షను ఎదుర్కోనుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు అసెంబ్లీ సమావేశమవుతుందని ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. స్పీకర్ - డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత విశ్వాసపరీక్ష జరుగుతుంది. ఆటంకాలన్నీ తొలిగినందున శుక్రవారం జరిగే విశ్వాసపరీక్షను కుమారస్వామి సునాయాసంగా నెగ్గుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. మెజారిటీ నిరూపించుకున్న తర్వాతే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగనుంది. 78మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ 20 మంత్రి పదవులను - 37మంది సభ్యులున్న జేడీఎస్ 12 మంత్రిపదవులను పొందనుంది.