Begin typing your search above and press return to search.

ట్రంప్ భ‌రోసా..భార‌తీయుల‌కు బెదిరింపులు!

By:  Tupaki Desk   |   7 Feb 2017 11:07 AM GMT
ట్రంప్ భ‌రోసా..భార‌తీయుల‌కు బెదిరింపులు!
X
వలసవాదులపై అమెరికా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మరో విద్వేషపూరిత ఘటన హూస్టన్‌ లో వెలుగుచూసింది. స్థానికంగా నివ‌సిస్తున్న దక్షిణాసియాకు చెందిన ఒక కుటుంబం ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు ఒక లేఖ వదిలి వెళ్లారు. తెల్లారిన తర్వాత ఆ లేఖ ఇంటి తలుపు వద్ద ఉండటాన్ని ఆ కుటుంబం గమనించింది. అందులో ముస్లింలు - ఇండియన్లు - యూదులను ఇక వదిలించుకోవాల్సి ఉంది అని రాసి ఉంది. ఈ ఘటన ఫోర్ట్‌ బెండ్ జిల్లా హూస్టన్ సబర్బన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దక్షిణాసియా నుంచి వచ్చిన వారు ఈ ప్రాంతంలో అత్యధికంగా నివసిస్తుంటారు.

"మన కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ శ్వేతజాతి దేశానికి దేవుడిచ్చిన వరం. ముస్లింలు, భారతీయులు, యూదులను వదలించుకోవాలి. టెక్సాస్ నుంచి వెళ్లిపోవాలని, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పోవాలని వారికి చెప్పాలి" అని ఆ లేఖలో రాసి ఉంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి, బహిరంగంగా చర్చ చేయడానికి కూడా ఆ కుటుంబీకులు భయపడ్డారని వారి స్నేహితుడొకరు చెప్పారు. ప్రత్యేకంగా తమ కుటుంబాన్నే ఎంచుకున్నారా? లేక వెళ్తూ వెళ్తూ కనిపించిన ఇంటి వద్ద లేఖ వదిలి వెళ్లారా? అన్నది తెలియడం లేదని ఆయన అన్నారు. ఇది పక్కా విద్వేష పూర్తి భాషేనని ఆయన చెప్పారు. వారం వ్యవధిలో ఇటువంటిది ఇది రెండో ఘటన. కొద్ది రోజుల క్రితం ఇదే జిల్లాలోని సవన్నా ప్లాంటేషన్స్‌లో ఫెన్సింగ్‌ కు స్వస్తిక్ చిహ్నాన్ని స్ప్రే పేయింట్ వేశారు. స్వ‌స్తిక్ చిహ్నం హిట్ల‌ర్ ఉప‌యోగించిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలాఉండ‌గా... అమెరికాలో దూకుడును ప్రదర్శిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఆస్ర్టేలియాలో చిచ్చుపెట్టాడు. ట్రంప్ ఎత్తుగ‌డ‌కు ఆస్ట్రేలియన్‌ వాసులు రెండు భాగాలుగా విడిపోయారు. అయితే ఎప్పుడూ కలిసి ఉండే ఆస్ట్రేలియన్లను ట్రంప్‌ ఏ విషయంలో విడదీశారని అనుకుంటున్నారా? ఇటీవల ఏడు ముస్లిం దేశాలపై బ్యాన్‌ను పెట్టాడు కదా, ఈ నిర్ణయం కరెక్ట్‌ అని సగం మంది, కాదని మిగతా సగం మంది తగువుకు దిగారట. ఓ ఆన్‌లైన్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో 44 శాతంమంది ఆస్ట్రేలియన్లు ట్రంప్‌ నిర్ణయానికి అనుకూలంగా నిలవగా, 45 శాతం మంది మాత్రం వ్యతిరేకంగా నిల్చున్నారట. కన్జర్వేటివ్‌ ఓటర్లంతా కూడా ట్రంప్‌ శైలి తమకు నచ్చిందని, దానిని ప్రవేశపెడితే ఆస్ట్రేలియాలోకి కూడా వలసలు రాకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారట. అయితే ఆ దేశ ప్రధాని మాల్కోమ్‌ టర్న్‌బుల్‌ మాత్రం అమెరికా వ్యక్తిగత అంశాల్లో తాము జోక్యం చేసుకోమని, అది ఆ దేశం ఇష్టమంటూ సమాధానం దాటవేశారు.