Begin typing your search above and press return to search.

జయ మరణంపై విచారణకు రెడీ - అపోలో

By:  Tupaki Desk   |   18 July 2017 5:29 PM GMT
జయ మరణంపై విచారణకు రెడీ - అపోలో
X
జయలలిత మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని... ఆమె మరణంపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని ఆమెకు చికిత్స అందించిన అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు.

జయలలిత మృతిపై ఇప్పటికీ చాలామంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. న్యాయవిచారణ జరపాలంటూ మాజీ సీఎం పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జయలలిత మరణంపై ఎటువంటి విచారణ జరిపినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జయలలితకు అందచేసిన చికిత్సలలో ఎటువంటి పొరపాటు జరగలేదని ఆమె చికిత్సలలో ఎవరూ జోక్యం చేసుకోలేదన్నారు.

కాగా జయలలిత 2016 సెప్టెంబరులో హఠాత్తుగా అస్వస్థతకు గురికాగా ఆమెను అపోలో హాస్పిటల్‌లో చేర్చారు. అప్పటి నుంచి ఆమెకు అపోలోలో 70 రోజులకు పైగా చికిత్సలందించారు. కోలుకుంటుందని ఆసుపత్రి వర్గాలు చెప్పిన కొద్ది రోజుల్లోనే ఆమె మరణించారు. అనంతరం ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె కాళ్లను తొలగించారని... సరైన చికిత్స అందించలేదని.. కొందరు చికిత్సను ప్రభావితం చేసి ఆమె మరణించేలా చేశారని అనేక ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రతాపరెడ్డి ఇప్పుడు దానిపై విచారణకు కూడా సిద్ధమని ప్రకటించారు.