Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్‌ లో జ‌నాభా కంటే 6 ల‌క్ష‌ల ఓట‌ర్లెక్కువా..!

By:  Tupaki Desk   |   12 Aug 2015 6:41 AM GMT
గ్రేట‌ర్‌ లో జ‌నాభా కంటే 6 ల‌క్ష‌ల ఓట‌ర్లెక్కువా..!
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డ ఓట్ల తొల‌గింపు అంశం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్ర‌ధానంగా టీడీపీ, బీజేపీకి ప‌ట్టున్న ప్రాంతాల్లో సెటిల‌ర్స్ ఓట్ల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం కావాల‌ని తొల‌గిస్తోందంటూ ఆయా పార్టీల నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోప‌ణ‌ల మాటెలా ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు గ్రేట‌ర్ ప‌రిధిలో ఒక్క ఓటు కూడా తొల‌గించ‌లేద‌ని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సోమేష్ కుమార్ చెపుతున్నారు.

ఆధార్ కార్డు-ఓట‌ర్ల అనుసంధానం కార్యక్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ న‌గ‌రంలో జ‌నాభా సంఖ్య 67 ల‌క్ష‌లు ఉంటే ఓట‌ర్ల సంఖ్య 73 ల‌క్ష‌లుగా ఉంద‌న్నారు. ఆయ‌న చెప్పిన దానిని బ‌ట్టి చూస్తే జ‌నాభా కంటే ఓట‌ర్ల సంఖ్య 6 ల‌క్ష‌లు ఎక్కువ‌గా ఉంది. ఈ లెక్క‌న ఓట‌ర్ల జాబితాలో ఏ స్థాయిలో బోగ‌స్ లేదా అద‌న‌పు ఓట్లు ఉన్నాయో అర్థ‌మ‌వుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు 47 శాతం ఓట‌ర్ల‌ను ఆధార్‌ తో అనుసంధానించిన‌ట్టు ఆయ‌న చెప్పారు. కొంద‌రికి రెండు, మూడు ఓట్లు కూడా ఉన్నాయ‌ని..ఇలాంటి ఓట్ల విష‌యంలో ఒకటికి రెండుసార్లు త‌నిఖీ చేశాకే నోటీసులు ఇస్తున్నామ‌న్నారు. ఇక ఓట్ల తొలగింపు విష‌యంలో రాజ‌కీయ పార్టీలు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న చెప్పారు.