Begin typing your search above and press return to search.

ఎవరితో పొత్తు లేదు..ఒంటరిగానే బరిలోకి - మేయర్ పీఠం మాదే :మంత్రి కేటీఆర్!

By:  Tupaki Desk   |   19 Nov 2020 2:10 PM GMT
ఎవరితో పొత్తు లేదు..ఒంటరిగానే బరిలోకి - మేయర్ పీఠం మాదే :మంత్రి కేటీఆర్!
X
గ్రేటర్ ఎన్నికల నగారా మోగడం తో అన్ని ప్రధాన పార్టీలు కూడా విజయమే లక్ష్యంగా అభ్యర్ధులని ఎంపిక చేస్తూ , ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు.. ఈ రోజు తుది జాబితాను విడుదల చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే .. ఈ రోజు మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో పొత్తుపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ కు ఎవరితోనూ పొత్తు లేదని, ఒంటరిగానే 150 స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. తమ మిత్రపక్షం ఎంఐఎం తోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.

ఇక గత ఎన్నికల్లో 5చోట్ల ఎంఐఎంను ఓడించామని, ఈసారి 10 చోట్లకుపైగా ఎంఐఎంను ఓడిస్తామన్నారు కేటీఆర్. జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో 150 సీట్లలో టీఆర్ ఎస్ అభ్యర్థులు పోటీచేస్తారు. ఎవరితో మాకు దోస్తీ లేదు. ఈ సారి పాత బస్తీ లో పది సీట్లు గెలుస్తాం. ఎంఐఎంను ఓడగొట్టి ఆ సీట్లు గెలుస్తాం. మా అభ్యర్థి యే మేయర్ అవుతారు. ఎంఐఎంకు ఎందుకిస్తాం , మాకు పిచ్చా , బల్దియా మీద గులాబీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం. జీహెచ్‌ ఎం సి లో రెండో స్థానం ఎవరిదో కాంగ్రెస్, బీజేపీలు తేల్చుకోవాలి అని అన్నారు.

100 స్థానాల్లో గెలిస్తే తాము మేయర్ అవుతాం అని, డిసెంబర్ నాలుగున టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మహిళ మేయర్‌ గా కూర్చుంటుందని, తమకు మరో ఆలోచన లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.

అలాగే , దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ ‌ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీకి గతంలో వచ్చిన ఫలితాలే ఈసారి కూడా వస్తాయని జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే .. 17న జీహెచ్ ఎం సీ ఎన్నికల షెడ్యూల్‌ తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. డిసెంబరు 1న పోలింగ్ జరుగుతుంది. 4న ఫలితాలను వెల్లిస్తారు. అవసరం అనుకుంటే 3న రిపోలింగ్ నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలను నిర్వహించబోతున్నారు.