Begin typing your search above and press return to search.

ఆయనడగాలే కానీ ఇప్పుడే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేస్తాం

By:  Tupaki Desk   |   3 Aug 2019 2:30 PM GMT
ఆయనడగాలే కానీ ఇప్పుడే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేస్తాం
X
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ కీలక ప్రకటన చేశారు. మిత్రపక్షం శివసేన కోరాలే గానీ ఇప్పటికిప్పుడు ఆ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రేను ఉప ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. తన ప్రభుత్వంలో ఆదిత్య ఠాక్రే ఉంటే అంతకుమించిన సంతోషం ఇంకేముంటుందని అన్నారు.

జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడణవీస్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో శివసేన, తాము కలిసి పోటీ చేస్తామని..దాదాపు సమాన సంఖ్యలో సీట్లలో పోటీ చేస్తామని.. మిగతా కొన్ని సీట్లు చిన్నచిన్న మిత్రపక్షాలకు ఇస్తామని చెప్పారు. గతం ఎన్నికల్లో శివసేన వేరేగా పోటీ చేసిందని.. అప్పుడు 144 సీట్లకు పోటీ చేసిన తమకు 122 సీట్లు వచ్చాయని చెప్పారు. ఈసారి శివసేన, తాము కలిసి చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయి ఘన విజయం నమోదు చేస్తామని చెప్పారు.

మరోవైపు మోదీ గత ప్రభుత్వంలో ఎన్డీయే భాగస్వామిగా ఉంటూనే మధ్యలో విభేదించి ఆ తరువాత ఎన్నికలకు ముందు మళ్లీ పూర్తి సహకారం అందించిన శివసేన ఇప్పుడు తన రాజకీయ వ్యూహాలను, విధానాలను చాలా వేగంగామార్చుకుంటోంది. మునుపెన్నడూ లేనట్లుగా బాల్ ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి కీలక పదవి చేపట్టాలని భావిస్తోంది. అందుకోసం బీజేపీకి అనుకూలంగా మసలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కొద్దిరోజుల కిందట మమత బెనర్జీపై శివసేన అధినేత విరుచుకుపడడం దీనికి ఉదాహరణ. రాముడికి కోపమొస్తే బెంగాల్ మరో అయోధ్య అవుతందని ఆయన హెచ్చరించారు. ఇదంతా ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రేను సీఎం చేయడానికేనని తెలుస్తోంది. అయితే.. బీజేపీ మాత్రం ఆదిత్యకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని అంటోంది.

ఠాక్రే కుటుంబం నుంచి ఇంతవరకు ఎవరూ ఎన్నికల్లో పోటీచేయడంకానీ, పదవులు చేపట్టడం కానీ చేయలేదు. బాల్ ఠాక్రే కానీ, ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే కానీ, ఆ కుటుంబంలోని ఇంకెవరు కానీ ఇంతవరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీ పదవులు తప్ప ప్రభుత్వ పదవులు చేపట్టలేదు. పార్టీలోని ఇతర నేతలకే ఆ అవకాశాలు కల్పించారు. కానీ.. తొలిసారి ఉద్ధవ్ కుమారుడు, బాల్ ఠాక్రే మనవడు అయిన ఆదిత్య ఠాక్రే పదవి చేపట్టాలనుకుంటున్నారు. ఆదిత్యను మహారాష్ట్ర సీఎం చేయాలని ఉద్దవ్ భావిస్తున్నారు. బీజేపీ మాత్ర డిప్యూటీ సీఎం పదవి ఇస్తామంటోంది. కానీ, ఠాక్రేలు డిప్యూటీ పదవులు చేపట్టరంటూ ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెబుతుండడంతో రెండు పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందం కుదురుతుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.