Begin typing your search above and press return to search.

‘మారటోరియం’ వడ్డీ మేమే భరిస్తాం..సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం

By:  Tupaki Desk   |   20 Nov 2020 3:30 AM GMT
‘మారటోరియం’ వడ్డీ మేమే భరిస్తాం..సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం
X
కరోనా లాక్​డౌన్​తో దేశవ్యాప్తంగా చిన్న చితకా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. పలు కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయాయి. దీంతో చిరు వ్యాపారులు, ఉద్యోగులు బ్యాంకులకు ఈఎమ్​ఐలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లోన్​లపై మారటోరియం విధించింది. అయితే మారటోరియం కాలంలో పడే చక్రవడ్డీ ఎవరు కడతారనే దానిపై సందిగ్ధత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లగా మారటోరియం కాలంలో పడే చక్రవడ్డీని మేమే భరిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది.

మార్చి నుండి ఆగస్ట్ వరకు మారటోరియం కాలానికి సంబంధించి బ్యాంకు రుణగ్రహీతల చక్రవడ్డీని భరించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే తాము చక్రవడ్డీని భరిస్తున్నామని ఇంకా ఉపశమనాలు కల్పిస్తే బ్యాంకింగ్​ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉన్నదని కేంద్రం తెలిపింది. మారటోరియం కాలంలో వడ్డీ, చక్రవడ్డీకి సంబంధించి సుప్రీం కోర్టుకు కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది.

బాధ్యత బ్యాంకులపై ఉంది
చక్రవడ్డీకి సంబంధించి రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై మాఫీ చేయాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని కేంద్రం... అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. మారటోరియం కాలంలో ఈఎంఐలు చెల్లించిన వారికి కూడా ప్రయోజనం కల్పిస్తామని తెలిపింది. దీంతో పాటు కరోనా సమయంలో కేంద్రం తీసుకు వచ్చిన ఉద్దీపన పథకాలను, చితికిపోయిన రంగాలకు ఆత్మనిర్భర్ భారత్ కింద ఇచ్చిన ప్యాకేజీని కేంద్రం వివరించింది. విద్యుత్ పంపిణీ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట కల్పించామని తెలిపారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.