Begin typing your search above and press return to search.

బాబును మళ్లీ సీఎంగా చూస్తాం: అశ్వినీద‌త్‌

By:  Tupaki Desk   |   29 March 2022 8:30 AM GMT
బాబును మళ్లీ సీఎంగా చూస్తాం: అశ్వినీద‌త్‌
X
మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడిని మ‌ళ్లీ సీఎంగా చూస్తామ‌ని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీద‌త్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. అతి త్వ‌ర‌లోనే బాబు ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న దీమాగా వ్యాఖ్యానించారు. టీడీపీ పార్టీ 40వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆ పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహ‌న‌రావు నేనే.. తెలుగుదేశం అనే పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో అశ్వినీద‌త్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. బాబును మ‌ళ్లీ సీఎంగా చూడాల‌ని ఉంద‌ని, అతి త్వ‌ర‌లో ఆయ‌న ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న ఆకాక్షించారు.

కంభంపాటి రామ్మోహ‌న్‌పైనా అశ్వినీద‌త్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న్ని మంచి ప‌ద‌విలో చూస్తామ‌నే న‌మ్మ‌కాన్ని వెలిబుచ్చారు. పింగ‌ళి వెంక‌య్య కుటుంబ స‌భ్యుల క‌ష్టాల‌ను రామ్మోహ‌న్ పార్ల‌మెంటులో ప్ర‌స్తావించార‌ని పొలిట్ బ్యూరో స‌భ్యుడు రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి గుర్తుచేశారు.

ప్రతి ఒక్కరికి తండ్రి పేరుతో పాటు త‌ల్లి పేరు కూడా ఉండేలా చేసిన‌ రామ్మోహ‌న్కు శ‌త్రువులు లేర‌ని ఆయ‌న పేర్కొన్నారు. సంక్షేమాన్ని దేశానికి ప‌రిచ‌యం చేసింది.. దేశంలో మొట్ట‌మొద‌టి సారి వృద్ధాప్య పింఛ‌న్ ఇచ్చింది ఎన్టీఆర్ అని కొనియాడారు.

హైదరాబాద్ ఇప్పుడు ఇలా ఉందంటే అందుకు కార‌ణం చంద్ర‌బాబు అని చెప్పారు. హైద‌రాబాద్‌కు ఈ సంపాద‌న రావ‌డానికి కార‌ణం బాబు వేసిన బీజమేన‌ని ఎంతో మంది ఐటీ ఉద్యోగులు బాబును గుర్తు చేసుకుంటున్నార‌ని వెల్లడించారు.

చంద్ర‌బాబుకు వ‌చ్చింది విరామమే కానీ విర‌మ‌ణ కాద‌ని అశ్వినీద‌త్‌, రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, దేశానికి దిక్సూచి టీడీపీయేన‌ని పేర్కొన్నారు. ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపిన చంద్ర‌బాబు ప్ర‌జ‌ల కోస‌మే క‌ష్ట‌ప‌డుతున్నార‌ని తెలిపారు.

ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ జోరు ముందు టీడీపీ తేలిపోయిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ధాటికి బాబు కొట్టుకుపోయారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌పై బాబు ఇప్ప‌టి నుంచే దృష్టి సారించారు. 2024లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.