Begin typing your search above and press return to search.

ఈ నెక్లెస్‌ను అరగంట ధరిస్తే 80 శాతం కరోనా వైరస్ అంతం

By:  Tupaki Desk   |   13 July 2020 3:45 AM GMT
ఈ నెక్లెస్‌ను అరగంట ధరిస్తే 80 శాతం కరోనా వైరస్ అంతం
X
కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం ప్రపంచ దేశాల్లోని ఎంతోమంది శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. వివిధ దేశాలు వ్యాక్సీన్ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇండోనేషియాకు చెందిన వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిపింది. తాము ఓ మొక్క ఆకులతో తయారు చేసిన నెక్లెస్ వేసుకుంటే కరోనా దూరమవుతుందని చెప్పడం గమనార్హం. ఈ ప్రకటన కూడా దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెప్పింది.

ఇండోనేషియాకు చెందిన ఆరోగ్య పరిశోధన, అభివృద్ధి సంస్థ బాలిట్‌బాంగ్తన్ నీలగిరి ఆకులతో యాంటీ వైరస్ నెక్లెస్‌ను సిద్ధం చేసింది. దీనిని మెడలో వేసుకుంటే కరోనా దరి చేరదట. అంతేకాదు, ఒకవేళ కరోనా సోకినా నశించిపోతుందని ప్రకటించింది. దీనిని ప్రభుత్వం ధృవీకరించడందతో పాటు పెద్ద ఎత్తున నెక్లెస్‌లు తయారు చేస్తోంది. ఈ మేరకు మంత్రి సెహ్రూల్ యాసిన్ లింపో మాట్లాడారు.

కరోనాను చంపేందుకు నీలగిరి జాతికి చెందిన 700 రకాల మొక్కలతో ఈ నెక్లెస్‌ను తయారు చేశామని, దానిని పావుగంట ధరిస్తే 42% వైరస్ నశిస్తుందని, 30 నిమిషాలు ధరిస్తే 80% వైరస్ చనిపోతుందని తెలిపారు. వీటిని తాము ప్రయత్నించి చూశామని, ఇది బాగా పని చేస్తుందని, పలు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్న సమయంలో వీటిని ధరిస్తున్నామని చెప్పారు. ఎవరికైనా కత్తిగాట్లు పడినా దీంతో నయమవుతుందంటున్నారు.

దీనిని వ్యవసాయ శాఖలోని ఇరవై మంది ఉద్యోగులపై ప్రయోగించినట్లు బాలిట్ బాంగ్తన్ సంస్థ హెడ్ తెలిపారు. కరోనా సోకిన ఉద్యోగులు ఈ నెక్లెస్‌ను ధరించిన తర్వాత వారికి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది తొలగిందన్నారు. అయితే ఈ యాంటీ వైరస్ నెక్లెస్ పట్ల ఇండోనేషియన్ సైంటిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో శాస్త్రీయత లేదంటున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనాకు మందు రాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెక్లెస్ వల్ల వ్యాప్తి చెందకుంటే ధరించడంలో తప్పులేదంటున్నారు.