Begin typing your search above and press return to search.

ఉద్యమ నాయకులు అమ్ముడుపోయారా... ?

By:  Tupaki Desk   |   7 Feb 2022 8:30 AM GMT
ఉద్యమ నాయకులు అమ్ముడుపోయారా... ?
X
ఏపీలో ఉద్యోగుల ఆందోళన గత కొంతకాలంగా సాగుతూ వచ్చింది. దానికి పరాకాష్టగా చలో విజయవాడ కార్యక్రమం నిలిచింది. ఈ కార్యక్రమం అయితే ఏపీ మొత్తాన్ని ఆకర్షించింది. లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పదమూడు జిల్లాల నుంచి బెజవాడ వీధులకు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేయడం అంటే వైసీపీ సర్కార్ కూసాలు కదిలిపొయినట్లే అని అనుకున్నారు.

ఇది సమ్మె సన్నాహక నిరసన సభే ఈ రేంజిలో సాగితే సమ్మె ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ కూడా అందరిలో కలిగింది. నిజంగా సమ్మె జరిగితే మాత్రం అది ఇక ఏపీలోనే అతి పెద్ద రికార్డుగా ఉండేది. కానీ పరిస్థితి అంతవరకూ రానీయకుండా ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. ఇటు ఉద్యోగులు కూడా చర్చలకు వచ్చారు. ఇలా కొన్ని గంటల పాటు సాగిన చర్చల సారాంశం మేరకు కధ సుఖాంతం అయింది.

ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వం తగ్గకపోయినా చాలా డిమాండ్లను నెరవేర్చింది అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్పారు. అయితే సరిగ్గా ఇక్కడే ఉపాధ్యాయ సంఘాలు మాత్రం పూర్తి స్థాయిలో విభేదించాయి. కొత్త పీయార్సీ తమకు సమ్మతం కాదని తెగేసి చెప్పేశాయి. తమకు తీరని అన్యాయమే జరిగింది అని కూడా హాట్ కామెంట్స్ చేశాయి.

గ్రామీణ ప్రాంతాలలోని ఉపాధ్యాయులకు ఇంటి అద్దె అలవెన్స్ ఇపుడు దారుణంగా తగ్గిపోయింది అని కూడా వాపోయారు. 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఉపాధ్యాయులు శనివారం అర్ధరాత్రి నుంచే ఆందోళన చేపట్టాయి. ఆదివారం అంతా కూడా ఏపీలోని పదమూడు జిల్లాల్లో ఎటు చూసినా నిరసనలు చేస్తూ టీచర్లు కనిపించారు.

ఇక సోమవారం నుంచి తెల్లారుతూనే ఉపాధ్యాయులు నల్ల బాడ్జీలు ధరించి పాఠశాలలకు వచ్చ్చారు. తాము ఉద్యమం పూర్తిగా కొనసాగిస్తామని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఏకంగా తమ బాణాలను పీయార్సీ సాధన సమితి నేతల మీదకు ఎక్కు పెడుతున్నారు. నాయకులు కొందరు ప్రభుత్వానికి అమ్ముడు పోయారని, అందుకే రివర్స్ పీయార్సీకి ఒప్పుకున్నారని, తమ డిమాండ్లు ఏమీ పరిష్కారం కాకుండా సమ్మె విరమించారని కూడా మండిపడుతున్నారు.

లక్షలాది ఉపాధ్యాయులకు అన్యాయం చేశారని కూడా వారు అంటున్నారు. ఇది నిజంగా ద్రోహం అని కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. ఉద్యోగులతో కలసి తాము పోరాటం చేయడమే తప్పు అని కూడా అంటున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి బయటకు అచ్చి మరీ సొంతంగా తాము ఉద్యమిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని కూడా విమర్శిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ సంఘాలు తమ నిరసనలో మంత్రుల కమిటీతో చేసుకున్న ఒప్పంద పత్రాలను కూడా దహనం చేయడం విశేషం.

తమ డిమాండ్లు నెరవేరేవరకూ తాము ఎక్కడా తలొగ్గేది లేదని అంటున్నారు. ఉపాధ్యాయ సంఘాల్లో బలంగా ఉన్న ఏపీటీఎఫ్, యూటీఎఫ్ నేతలు అయితే ప్రభుత్వం కొత్త పీయార్సీలో అందరికీ అన్యాయమే చేసింది అంటున్నారు. ఇక పీయార్సీ సాధన కమిటీ నేతలు చలో విజయవాడతో వచ్చిన సంఘటితను, పోరాటపటిమను సక్రమంగా ఉపయోగించుకోలేకపోయారని కూడా నిందిస్తున్నారు. ఇక సమ్మె విరమణ అంతా ఏకపక్షంగా సాగిందని దుమ్మెత్తిపోస్తున్నారు.

అసలు పోరాటం అంటే ఏంటో తాము చూపిస్తామని కూడా వారు చెబుతున్నారు. మరి ఉపాధ్యాయుల విమర్శల మీద ఉద్యోగ సంఘ నేతలు ఏవరూ మాట్లాడకపోయినా వారు చేసినవి మాత్రం చాలా షాకింగ్ కామెంట్స్ గానే చూడాలి, వీటిలో అమ్ముడు పోయారు అన్న మాట అయితే దారుణమైనదే. మరి దీనికి ఉద్యోగ సంఘ నేతల తరఫున ఎవరైనా రియాక్ట్ అవుతారో ఏమో చూడాల్సి ఉంది.