Begin typing your search above and press return to search.

సానుభూతి కోసం క‌న్న‌కూతుర్ని కిడ్నాప్ చేయించిన బీజేపీ నేత‌!

By:  Tupaki Desk   |   18 Feb 2019 8:11 AM GMT
సానుభూతి కోసం క‌న్న‌కూతుర్ని కిడ్నాప్ చేయించిన బీజేపీ నేత‌!
X
అధికార‌మంటే అంద‌రికీ ఆశే. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి దాన్ని చేజిక్కించుకునేందుకు ఒక్కొక్క‌రు ఒక్కోలా ప్ర‌య‌త్నిస్తుంటారు. త‌మదైన వ్యూహాలు ర‌చిస్తుంటారు. ఓట్ల కోసం ప్ర‌జ‌ల్లో పాపులారిటీ పెంచుకునేందుకు కృషి చేస్తుంటారు. జ‌నాన్ని ఆక‌ట్టుకుంటుంటారు. మ‌రికొంద‌రు అడ్డ‌దారులూ ఆశ్ర‌యిస్తుంటారు. బెదిరింపుల‌కు దిగుతుంటారు. ప‌శ్చిమ బెంగాల్‌ లో బీజేపీ నేత ఒక‌రు మాత్రం వీట‌న్నింటికి భిన్న‌మైన వ్యూహం ఎంచుకున్నాడు. అధికార దాహంతో విచ‌క్ష‌ణ మ‌రిచి ప్ర‌వ‌ర్తించాడు. ప్ర‌జ‌ల్లో సానుభూతి సంపాదించుకునేందుకు క‌న్న కూతుర్ని కిడ్నాప్ చేయించాడు! ఆ నేరాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే పై నెట్టి ఆయ‌న‌ను డీ ఫేమ్ చేయించేందుకు ప్ర‌య‌త్నించాడు.

బీర్బమ్‌ జిల్లా లాభ్‌ పూర్ లో బీజేపీ నేత సుప్రభాత్‌ బత్యబాల్‌ కుమార్తె గత గురువారం కిడ్నాప్ కు గుర‌వ్వ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. సుప్రభాత్‌ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడిన దుండగులు తుపాకీతో బెదిరించి ఆయన కుమార్తెను అపహరించుకుపోయారు. ఈ ఘటనతో లాభ్‌ పూర్‌ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కిడ్నాప్‌ వెనుక స్థానిక తృణమూల్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే మ‌నిరుల్ ఇస్లామ్ హ‌స్త‌ముంద‌ని సుప్ర‌భాత్ వ‌ర్గీయులు ఆరోపించారు. శ‌నివారం ఆయ‌న కారుపై దాడికి కూడా పాల్ప‌డ్డారు. దీంతో ఎమ్మెల్యే పోలీసు స్టేష‌న్ వెళ్లి త‌ల‌దాచుకోవాల్సి వ‌చ్చింది.

సుప్ర‌భాత్ కుమార్తె కిడ్నాప్ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు మాల్డా జిల్లాలోని డ‌ల్ఖోలా ప్రాంతంలో ఆమె ఆచూకీ గుర్తించారు. సుర‌క్షితంగా ఆమెను ఇంటికి చేర్చారు. అయితే - ద‌ర్యాప్తు క్ర‌మంలో పోలీసులు దిగ్భ్రాంతిక‌ర విష‌యాల‌ను గుర్తించారు. కుమార్తె కిడ్నాప్ వ్య‌వ‌హారంలో సుప్ర‌భాత్ హ‌స్త‌ముంద‌ని తెలుసుకున్నారు. ఆయ‌న్ను, ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో సానుభూతి పొందేందుకు, స్థానిక ఎమ్మెల్యే ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేందుకే సుప్ర‌భాత్ కుమార్తె కిడ్నాప్ ప్లాన్ ర‌చించాడ‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.