Begin typing your search above and press return to search.

గెలుపు తర్వాత.. ఈ గోలేంది కమలనాథులు?

By:  Tupaki Desk   |   20 March 2021 5:30 PM GMT
గెలుపు తర్వాత.. ఈ గోలేంది కమలనాథులు?
X
ఏమైనా సరే.. బెంగాల్ కోట మీద కాషాయ జెండా ఎగరాలన్న కసితో ఉన్న కమలనాథులు.. అందుకు తగ్గట్లే.. చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. తమకు ఏ మాత్రం నచ్చని దీదీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో దారుణంగా ఓడించి అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకు ఏళ్ల తరబడి ప్లానింగ్ లో ఉన్నారు. అంతా బాగుందనుకున్న వేళ.. అనుకోని రీతిలో చోటు చేసుకున్న రచ్చ కమలనాథుల్లో కొత్త కంగారును రేపింది. పరిస్థితి ఇప్పుడెంత సీరియస్ గా ఉందంటే.. అసోంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైన అమిత్ షా.. హుటాహుటిన కోల్ కతాకు వెళ్లిన పరిస్థితి. ఎందుకిలా? అంటే.. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాగా చెప్పాలి.

బెంగాల్ లోని వివిధ అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల కారణంగా.. ఆ పార్టీలో నిరసన చిచ్చు రేగింది. అదెంత ఎక్కువగా ఉందంటే.. పార్టీ నేతలు పలుచోట్ల నిరసనలు వ్యక్తం చేయటమే కాదు.. సొంత పార్టీ అభ్యర్థులను ఓడించే వరకు నిద్రపోమని శపధాలు చేసేస్తున్నారు. అంతేకాదు.. రోడ్ల మీదకు వచ్చి టైర్లు తగలబెట్టటమే కాదు.. పార్టీ కార్యాలయాల్ని ధ్వంసం చేసేందుకు వెనుకాడలేదు. పరిస్థితి తీవ్రతను గమనించిన అమిత్ షా.. హుటాహుటిన కోల్ కతాకు వెళ్లి.. పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ప్రజా బలం లేని వారే అధికమని.. అలాంటి వారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ తీమండిపడుతున్నారు. క్యాడర్ నిరసనల్ని తీవ్రంగా పరిగణించిన అమిత్ షా.. పార్టీ నేతలకు క్లాస్ పీకారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు? క్యాడర్ రియాక్షన్ ను ఎందుకు అంచనా వేయలేకపోయారు? ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించటమే కాదు.. హడావుడి ఢిల్లీ నుంచి పార్టీకి చెందిన పలువురు నేతల టీంను కోల్ కతాకు పిలిపించి.. నష్టనివారణ చర్యలు చేపట్టటం గమనార్హం.

తొలి నాలుగు విడతలకు జరిగే సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన సమయంలోనే పార్టీ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ రచ్చను పెద్దగా పట్టించుకోకుండా తాజాగా మరో 148 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయటంతో.. పెద్ద గొడవలకు కారణమైంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో ఆగమాగమైపోయిన పరిస్థితి. టీవీ చానళ్లు అన్ని.. ఈ గొడవల మీదే ఎక్కువగా ఫోకస్ చేశాయి. ఏదోలా దీదీ పార్టీని దెబ్బ తీయాల్సిన బీజేపీ.. అందుకు భిన్నంగా తమ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలకు ఎలా స్పందించాలో అర్థం కాక చేష్టలుడిగిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితే కొనసాగితే.. బీజేపీకి తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది.