Begin typing your search above and press return to search.

బెంగాల్ దంగ‌ల్‌: క‌మ్యూనిస్టుల కంచుకోట‌లో కామ్రెడ్ల ఊసేదీ ?

By:  Tupaki Desk   |   27 March 2021 5:30 AM GMT
బెంగాల్ దంగ‌ల్‌: క‌మ్యూనిస్టుల కంచుకోట‌లో కామ్రెడ్ల ఊసేదీ ?
X
క‌‌మ్యూనిస్టుల కంచుకోట‌... దాదాపు 35 సంవ‌త్స‌రాల పాటు అప్ర‌తిహ‌త అధికారం చ‌లాయించిన ప‌శ్చిమ బెంగాల్‌ లో ఇప్పుడు వారి ప‌రిస్థితి ఏంటి ? ఎలా ముందుకు సాగుతున్నారు ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి ఒక‌ప్పుడు ఒంట‌రి పోరుతో కాంగ్రెస్‌ కు చుక్క‌లు చూపించిన క‌మ్యూనిస్టులు.. 35 సంవ‌త్స‌రాలు వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. ఇక‌, ప‌దేళ్ల కింద‌ట నుంచి మాత్రం మ‌మ‌తా బెన‌ర్జీ రూపంలో క మ్యూనిస్టుల‌కు పెద్ద మైన‌స్ ఏర్ప‌డింది. కాంగ్రెస్ నుంచి విడిపోయి.. సొంత పార్టీ పెట్టుకున్న మ‌మ‌తా బెన‌ర్జీ.. క‌మ్యూనిస్టుల కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టే వ‌ర‌కు నిద్ర పోకుండా శ్ర‌మించారు. రెండు ద‌శాబ్దాల పాటు ఆమె క‌మ్యూనిస్టుల‌పై అలు పెర‌గ‌ని పోరాటం చేశారు.

ఆ స‌మ‌యంలోనే క‌మ్యూనిస్టులు మేల్కొని ఉంటే ప‌రిస్థితి వేరేగా ఉండేది.. కానీ, మ‌మ‌తను ఆమె రాజ‌కీయాల‌ను కూడా త‌క్కువ‌గా అంచ‌నా వేసుకున్నారు.. ఫ‌లితంగా 2011లో తొలిసారి క‌మ్యూనిస్టుల‌కు ఓట‌మి ప్రారంభ‌మైంది. త‌ర్వాత కూడా వారు తమ‌వంతుగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు స‌రిగా చేయ‌లేద‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఉత్థాన‌ప‌త‌నాల మాట అటుంచి.. జారుడు మెట్ల‌పై ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో త‌ర్వాత వ‌చ్చిన 2016 ఎన్నిక‌ల్లోనూ ప‌రాజ‌యం పాల‌య్యారు.. ఇక‌, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడైనా.. మ‌మ‌త‌ను కాద‌ని క‌మ్యూనిస్టుల‌కు బెంగాలీలు ప‌ట్టం క‌ట్టే ప‌రిస్థితి ఉందా ? అంటే.. ప్ర‌శ్న త‌ప్ప సమాధానం ల‌భించ‌డం లేదు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టుల‌కు తీవ్ర సెగ త‌గులుతోంది. ఒక‌ప్పుడు ఒంట‌రి పోరుతో అధికారం ద‌క్కించుకున్న వారు.. ఇప్పుడు పోయి పోయి.. కాంగ్రెస్‌ తో క‌లిసి సీట్లు పంచుకున్నారు. అంతేకాదు.. ప్ర‌చారంలోనూ దూకుడు చూపించ‌లేక పోతున్నారు. క‌మ్యూనిస్టుల ఓటు బ్యాంకును త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో బీజేపీ వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగులు వీరికి తీవ్ర విఘాతంగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో 294 స్థానాలున్న అసెంబ్లీలో గ‌త ఎన్నిక‌ల్లో 40కి ప‌రిమిత‌మైన క‌మ్యూనిస్టులు ఇప్పుడు దీనిలో స‌గ‌మైనా తెచ్చుకుంటారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

ఇక గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేవ‌లం మూడే మూడు అసెంబ్లీ సీట్ల‌తో స‌రిపెట్టుకున్న బీజేపీ రెండేళ్ల క్రితం జ‌రిగిన లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో ఏకంగా 18 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు బీజేపీ ఏకంగా మ‌మ‌త‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌ కు వ‌చ్చేస్తే.. క‌మ్యూనిస్టులు కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టి పోటీ చేస్తున్నారు. ఈ కూట‌మి ప్ర‌భావం రాష్ట్ర వ్యాప్తంగా గ‌ట్టిగా 50 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌జా ఉద్య‌మాలు వ‌దిలేయ‌డం, గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌కు స‌మాధానాలు చెప్ప‌లేని ప‌రిస్థితి క‌మ్యూనిస్టుల‌కు శ‌రాఘాతంగా మారాయ‌న‌డంలో సందేహం లేదు.