Begin typing your search above and press return to search.

బీజేపీ ఇంత బలహీనంగా ఉందా ?

By:  Tupaki Desk   |   29 March 2021 12:30 PM GMT
బీజేపీ ఇంత బలహీనంగా ఉందా ?
X
‘మనకు పశ్చిమబెంగాల్లోని చాలా పోలింగ్ బూత్ ల్లో పోలింగ్ ఏజెంట్లు లేరు. ఇలా అయితే కష్టమే. ఎన్నికల్లో గెలవలేము. అందుకే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ఓటర్లను కూడా పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా నియమించుకునే అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో ఎన్నికల కమీషన్ను ఒప్పించాలి’.. ఇది తాజాగా వైరల్ అవుతున్న బీజేపీ సీనియర్ నేతలిద్దరి ఆడియో సంభాషణలు. అంటే ఇది ఇప్పటిదికాదు. దాదాపు పదిరోజుల క్రితం బీజేపీ నేతలు ముకుల్ రాయ్, శిశిర్ బజోరియా మధ్య మొబైల్లో జరిగిన చర్చ.

అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకున్న వెంటనే ఢిల్లీ స్ధాయిలో ఏమి జరిగిందో ఏమో వెంటనే నేతలిద్దరు మాట్లాడుకున్నట్లే ఎలక్షన్ కమీషన్ ఓ ఆదేశాన్ని జారీచేసింది. అదేమిటయ్యా అంటే బెంగాల్లో ఓటరైతే చాలు ఎక్కడి పోలింగ్ కేంద్రంలో అయినా పోలింగ్ ఏజెంటుగా పనిచేయచ్చని. నిజానికి ఎన్నికల కమీషన్ జారీచేసిన ఆదేశంతో అన్నీ పార్టీలు ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే తాజాగా జారీఅయిన ఆదేశాలు అప్పటివరకు అమలులో ఉన్న నిబంధనలకు విరుద్ధం కాబట్టే.

మామూలుగా ఇప్పటివరకు ఉన్న నిబంధన ఏమిటంటే పోలింగ్ ఏజెంటుగా కూర్చునే వ్యక్తి తప్పనిసరిగా సదరు పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటరు అయ్యుండాలి. లేకపోతే పోలింగ్ ఏజెంటుగా ఎన్నికల కమీషన్ అంగీకరించదు. ఈ నిబంధన ఎందుకంటే పోలింగ్ కేంద్రంలోని వ్యక్తి అయితేనే సదరు కేంద్రం పరిధిలోని ఓటర్లను గుర్తిస్తారని. దీనివల్ల దొంగఓట్లను నియంత్రించ్చవచ్చన్న కారణంతోనే ఎన్నికల కమీషన్ పై నిబంధనను దశాబ్దాలుగా అమలుచేస్తోంది.

ముందు బీజేపీ నేతలిద్దరు మాట్లాడుకోవటం ఆ వెంటనే ఎన్నికల కమీషన్ వాళ్ళ మాటలకు అనుగుణంగానే కొత్తగా ఆదేశాలు జారీచేయటంతో మమతాబెనర్జీ మండిపోతున్నారు. రాజకీయపార్టీల స్పందన ఎలాగున్నా తాజా ఆడియోతో బీజేపీ బలహీనతలన్నీ బయటపడ్డాయి. కనీసం పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను కూడా ఏర్పాటు చేసుకోలేని పార్టీ ఏకంగా అధికారంలోకి వచ్చేస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఓ పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే పోలింగ్ ఏజెంట్ల పాత్ర కూడా కీలకమే. అలాంటిది ఇంత కీలకమైన వ్యవస్ధే లేని బీజేపీ ఇక అధికారంలోకి ఏమొస్తుందబ్బా ?