Begin typing your search above and press return to search.

దెబ్బకొట్టడమే కూటమి లక్ష్యమా?

By:  Tupaki Desk   |   29 March 2021 2:30 PM GMT
దెబ్బకొట్టడమే కూటమి లక్ష్యమా?
X
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కూటముల ప్రభావం ముదిరి పాకానపడుతోంది. మొదటిదశలో 30 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ పూర్తయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోలింగ్ తర్వాత సామాజికవర్గాల సమీకరణల్లో మార్పులు చేర్పులపై చర్చలు జోరందుకున్నాయి. ఈ నేపధ్యంలోనే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీని అధికారానికి దూరం చేయటమే తమ టార్గెట్ గా వామపక్ష+కాంగ్రెస్+ఐఎస్ఎప్ జట్టుకట్టి ‘సంయుక్తమోర్చా’ పేరుతో గట్టిగా ప్రయత్నిస్తోంది.

పై మూడు పార్టీలు ముస్లిం, హిందు ఓట్లను టార్గెట్ గా పెట్టుకుని అభ్యర్ధులకు టికెట్లను కేటాయించాయి. అంతేకాకుండా ముస్లిం ఓట్లు బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గాలపై గట్టిగా దృష్టిపెట్టాయి. నిజానికి వామపక్షాలు, కాంగ్రెస్ కు మొదట్లో అంత సీన్ లేదు. అయితే ముస్లింమత పెద్ద అబ్బాస్ సిద్ధిఖి ఇండియన్ సెక్యురల్ ఫ్రంట్ పేరుతో ఓ పార్టీ పెట్టడంతోనే ఈ రెండుపార్టీలకు కాస్త ఊపిరి వచ్చింది. దాంతో మూడు పార్టీలు కలిసి ఓ కూటమిగా ఫామ్ అయ్యాయి.

ముస్లిం సామాజికవర్గం మొదట్లో కాంగ్రెస్ కు తర్వాత వామపక్షాలకు మద్దతుగా నిలబడ్డాయి. అయితే తర్వాత తృణమూల్ పార్టీవైపు మొగ్గుచూపించాయి. అయితే తాజా ఎన్నికల్లో తృణమూల్ నుండి ముస్లిం ఓటుబ్యాంకును ఆకర్షించి లేదా చీల్చేయాలనే లక్ష్యంతోనే అబ్బాస్ సిద్ధిఖి ప్లాన్ చేశారు. అందుకనే కొత్తగా పార్టీపెట్టారు. ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో మెజారిటి ముస్లిం అభ్యర్ధులను పోటీలోకి దింపారు.

అబ్బాస్ కు మద్దతుగా వామపక్షాలు, కాంగ్రెస్ కూడా ముస్లింలకు పెద్దపీట వేశాయి. ముస్లిం ఓటుబ్యాంకును ఆకర్షించి అధికారంలోకి వచ్చేస్తామని భ్రమపడుతున్న తృణమూల్+బీజేపీని దెబ్బ కొట్టడమే తమ టార్గెట్ గా పై కూటమి నేతలు చెబుతున్నారు. వీళ్ళ ఉద్దేశ్యంలో తమ కూటమి నేరుగా అధికారంలోకి రాలేకపోయినా కనీసం ఎవరు అధికారంలోకి రావాలన్నా తమ మద్దతులేకుండా సాధ్యం కాదని అనుకుంటున్నారు.

సంయుక్తమోర్చా పేరుతో వామపక్షాలు 171 సీట్లు, కాంగ్రెస్ 91, ఐఎస్ఎఫ్ 26 సీట్లలో పోటీచేస్తున్నాయి. ఇదే సమయంలో ముస్లింఓటు బ్యాంకు చీలిపోతే తమకే లాభమని బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ముస్లింఓట్లలో చీలిక వల్ల దెబ్బపడితే తృణమూల్ కే అని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు.

ఇదే సమయంలో ముస్లిం ఓట్లలో చీలిక వచ్చినా అది నామమాత్రమే అని తృణమూల్ అధినేత్రి మమతబెనర్జీ అంచన. చివరకు ఏమవుతుందనేది ఆసక్తిగా మారింది. ఇందుకనే మొదటిదశ పోలింగ్ ఎవరికి అనుకూలమనే అంచనాల్లో పార్టీలు బిజీగా ముణిగిపోయాయి.