Begin typing your search above and press return to search.

అక్కడంతే.. పోలింగ్ బూత్ బయట.. 90 నిమిషాలు సీఎం బైఠాయింపు

By:  Tupaki Desk   |   2 April 2021 6:30 AM GMT
అక్కడంతే.. పోలింగ్ బూత్ బయట.. 90 నిమిషాలు సీఎం బైఠాయింపు
X
దేశంలోని కొన్ని రాష్ట్రాలు.. అక్కడి రాజకీయ పరిణామాల గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక బలమైన ప్రజాదరణ కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న నియోజకవర్గమంటే.. అక్కడ ఎన్నిక వార్ వన్ సైడ్ మాదిరి ఉంటుంది. అలాంటిది సదరు సీఎం.. ఏకంగా తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ బయట గంటన్నర పాటు బైఠాయించే పరిస్థితిని ఏమనాలి? ఎలా చూడాలి?

ఇలాంటి పరిస్థితి పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురైతే.. అలా చేయటంలో బీజేపీ సఫలమైంది. పోలింగ్ బూత్ లో అక్రమాలు జరుగుతున్నాయని.. రీపోలింగ్ నిర్వహించాలని ఎంతలా పట్టుపట్టినా ఫలితం లేకపోయింది. అంతేనా.. పోలింగ్ బూత్ లోకి తమ పార్టీ ఏజెంట్లను కూడా రానివ్వటం లేదని పార్టీ నేతలు చెప్పటంతో.. మమత ఉరుకులు పరుగులు పెడుతూ ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చింది. దీదీ బరిలో నిలిచిన చోట.. ఆమెకు తిరుగు ఉండదని అనుకుంటారు. అందుకు భిన్నంగా.. ఆమెకు.. ఆమె పార్టీ వారికి చెమటలు పట్టేలా చేయటంలో కమలనాథులు సక్సెస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.

మమత బరిలో ఉన్న నందిగ్రామ్ లో ఆమెకు పోటీగా.. ఒకప్పటి ఆమెకు ముఖ్య అనుచరుడిగా ఉండే సువేందు అధికారి బీజేపీ తరఫున బరిలో ఉండటం గమనార్హం. వీరిద్దరి మధ్య పోరు మామూలుగా ఉండదన్న అంచనాకు తగ్గట్లే.. పరిణామాలు చోటు చేసుకున్నాయి. నందిగ్రామ్ లో జరిగిన పోలింగ్ లో సీఎం మమతకు చుక్కలు కనిపించాయని చెప్పాలి. అత్యంత ఘర్షణపూరిత వాతావరణంలో.. ఉద్రిక్త పరిస్థితుల నడుమ చోటు చేసుకున్న పోలింగ్ మొత్తం 80.5 శాతంగా నమోదైంది. ఊహించని రీతిలో చోటు చేసుకున్న పరిణామాల వేళ.. తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.