Begin typing your search above and press return to search.

మోడీకి వ్యాక్సిన్ కంటే.. బెంగాల్ ఎన్నిక‌లే ముఖ్య‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   14 April 2021 9:32 AM GMT
మోడీకి వ్యాక్సిన్ కంటే.. బెంగాల్ ఎన్నిక‌లే ముఖ్య‌మ‌ట‌!
X
గ‌డిచిన ఇర‌వై నాలుగు గంట‌ల్లో దేశంలో ల‌క్షా 84 వేల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇది ఇప్ప‌టి వ‌ర‌కూ ఆల్ టైమ్ రి‌కార్డు. ఇలాంటి స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులేమిటి? భారత ప్రధానిగా నరేంద్ర మోడీ తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అన్న‌ప్పుడు.. రాష్ట్రాలతో మమేకం కావాలి ఉన్న‌ది. అందరినీ అప్రమత్తం చేస్తూ.. వైరస్ నిరోధానికి ప్రయత్నాలు చేయవలసి ఉన్నది. వ్యాక్సిన్ వేగంగా జనాలకు అందించ వలసి ఉన్నది. ఏ ప‌నులు ఎంత వ‌ర‌కు వ‌చ్చాయి? ఎక్క‌డ లోపాలు త‌లెత్తుతున్నాయి? వాటిని ఎలా సరిదిద్దాలి? అనే అంశాల‌పై స‌మీక్ష‌లు, క‌స‌ర‌త్తులు చేయ‌వ‌ల‌సి ఉన్న‌ది. కానీ.. ఇవ‌న్నీ వ‌దిలేసి కేవ‌లం బెంగాల్ అనే ఒక రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌పై దృష్టిపెట్టార‌నే విమ‌ర్శ‌లు తీవ్ర‌స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.

కేవ‌లం ప్ర‌ధాన‌మంత్రి మాత్ర‌మే కాదు.. హోం మంత్రి.. మంత్రులు.. మొత్తంగా కేంద్ర ప్ర‌భుత్వ‌మే బెంగాల్ లో కూర్చుంద‌నే విమ‌ర్శ‌లు వ్యక్త‌మ‌వుతున్నాయి. రోమ్ త‌గ‌ల‌బ‌డిపోతుంటే.. ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నాయి విప‌క్షాలు. క‌రోనా క‌రాళ నృత్యం చేస్తున్న వేళ‌.. న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై విశ్లేష‌కుల నుంచి కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు, క‌థ‌నాలు వ‌స్తుండ‌డం తోసి పుచ్చ‌లేనిది.

సుమారు 130 కోట్ల మంది జ‌నాభా ఉన్న భార‌త దేశంలో.. ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యాక్సిన్ 10 కోట్ల మందికి మించ‌లేద‌న్న‌ది అంచ‌నా. విదేశాలకు వ్యాక్సిన్ ఇచ్చే స్థాయికి వ‌చ్చామ‌ని, ప్ర‌పంచంలో తామే మొద‌ట‌గా వ్యాక్సిన్ తెచ్చామ‌ని ప్ర‌చారం చేసుకొని చ‌ప్ప‌ట్లు కొట్టించుకున్న ప్ర‌ధాని.. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ది శాతం మందికి కూడా వ్యాక్సిన్ అందించ‌క‌పోవ‌డం ఏంట‌నే సూటి ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ ఉత్ప‌తి, స‌ర‌ఫ‌రాపై దృష్టి సారించ‌కుండా.. బెంగాల్ పై దృష్టి పెట్ట‌డాన్ని నిల‌దీస్తున్నారు విమ‌ర్శ‌కులు.

అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ అంద‌ట్లేద‌ని మొత్తుకుంటున్నాయి. త‌మ‌కు మ‌రిన్ని డోసులు కావాల‌ని కోరుతున్నాయి. కానీ.. వాటి గురించి ఆల‌కించే నాథుడే లేకుండా పోయాడ‌ని అంటున్నారు. అటు త‌యారీ సంస్థ‌ల‌కు నిధులు నిండుకున్నాయని, ముడి స‌రుకులకు కూడా డ‌బ్బుల్లేక‌పోవ‌డం వ‌ల్లే ఉత్ప‌త్తి త‌గ్గిపోయింద‌ని, అందుకే.. జ‌నాల‌కు వ్యాక్సిన్ అంద‌ట్లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి వేగం ఎలా పెంచాల‌న్న‌దానిపై దృష్టి పెట్ట‌వ‌ల‌సి ఉన్న‌ది. కానీ.. ఇవ‌న్నీ వ‌దిలేసిన‌ ప్ర‌ధామంత్రి, హో మంత్రి, కేంద్ర మంత్రి వ‌ర్గం మొత్తం బెంగాల్లో మ‌కాం వేయ‌డాన్ని ఏమ‌నాలో తెలియ‌ట్లేదంటున్నారు విశ్లేష‌కులు.

దేశ ప్ర‌జ‌ల ప్రాణాల‌క‌న్నా.. వారికి వ్యాక్సిన్ అందించ‌డం క‌న్నా.. ఒక రాష్ట్రంలో ఎన్నిక‌లే మోడీకి ముఖ్య‌మ‌య్యాయా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇది ఏవిధంగానూ ఆమోద‌యోగ్యం కాద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో.. ఇదంతా వారికి తెలియ‌నిది కాద‌ని అంటున్నారు. కేవ‌లం రాజ‌కీయమే ప‌ర‌మావ‌ధిగా భావిస్తూ.. క‌రోనా అంశాన్ని కూడా ప‌క్క‌నబెట్టి, బెంగాల్ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింద‌ని అంటున్నారు. మ‌రి, ఈ ప్ర‌శ్న‌ల‌కు, విమ‌ర్శ‌ల‌కు బీజేపీ నేత‌లు ఏం స‌మాధానం చెబుతారో..?!