Begin typing your search above and press return to search.

ప్రశాంత్ కిషోర్ సూచన .. తెలుగు అధికారిక భాష .. సీఎం మమత కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   23 Dec 2020 11:57 AM GMT
ప్రశాంత్ కిషోర్ సూచన .. తెలుగు అధికారిక భాష .. సీఎం మమత కీలక నిర్ణయం
X
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడి రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాలని మమతా ప్రయత్నాలు చేస్తుంటే.. మమతాను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. నేతల పార్టీ మార్పులతో అక్కడి రాజకీయాలు రోజు రోజుకూ వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలుగుకు అధికార భాష హోదా కల్పిస్తూ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు బెంగాల్‌ లో ఉన్న తెలుగు ప్రజలను భాషాపరమైన మైనారిటీలుగా గుర్తించారు.పశ్చిమ బెంగాల్లో ని ఖరగ్‌ పూర్‌ లో ఎక్కువ మంది తెలుగు వారు నివసిస్తున్నారు. అందుకే ఖరగ్‌ పూర్ ‌ను మినీ ఆంధ్రాగా పిలుస్తారు. రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వేలాది తెలుగు వారు బెంగాల్‌ కు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అంతేకాదు స్థానిక రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఖరగ్‌పూర్‌ మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో ఆరుగురు తెలుగువాళ్లే కౌన్సిలర్లుగా ఉన్నారు. అంతేకాదు పలు పార్టీల్లోనూ లు కీలక పదవులు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకే తెలుగుకు అధికార భాష హోదా కల్పించారు మమత.

ఈ వ్యూహాల్లో భాగంగా తెలుగును అధికార భాషగా గుర్తించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే బెంగాల్‌లో 10 వరకు అధికార భాషలు ఉన్నాయి. తాజాగా తెలుగును కూడా అధికార భాషగా గుర్తించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. తెలుగును అధికార భాషగా గుర్తించింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో బాగా పరిచయం ఉన్న ప్రశాంత్ సూచనల మేరకే మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ సంప్రదాయబద్ధ ఓటుబ్యాంకును కాపాడుకుంటూనే.. బీజేపీ వ్యతిరేకులు, తటస్థులు, వామపక్ష భావజాలం ఉన్న నేతలనూ పార్టీ వైపు ఆకర్షితులను చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా- కొన్ని కీలక నిర్ణయాలను అధికార పార్టీ తీసుకుంటోంది. అన్ని వర్గాలు, వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన పశ్చిమ బెంగాల్‌లో స్థిరపడిన వారి ఓటర్లను మొగ్గు చూపేలా చర్యలు చేపట్టింది.