Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్ :పాల ప్యాకెట్ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి!

By:  Tupaki Desk   |   26 March 2020 1:30 PM GMT
లాక్ డౌన్ ఎఫెక్ట్ :పాల ప్యాకెట్ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి!
X
కరోనా తీవ్రమైన ఉగ్రరూపం దాల్చడం ప్రజాసంక్షేమం కోసమే లాక్‌ డౌన్‌ కు పిలుపిచ్చామన్న ప్రభుత్వాలు.. పోలీసుల ద్వారా దాన్ని అమలు చేయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమితమైపోగా - కొందరు మాత్రం యధేచ్ఛగా రోడ్లపై కి వస్తుండటంతో పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారు. అయితే ఈక్రమంలో కొందరు అమాయకులు బలవుతుండటం విషాదకర పరిణామం.

లాక్ డౌన్ సందర్భంగా కూతురి కోసం పాల ప్యాకెట్ కొనేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో అతను మరణించిన విషాద ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరా నగరంలో వెలుగుచూసింది. స్థానికంగా నివసించే లాల్ స్వామి(32) అనే వ్యక్తి తన కూతురికి కావాల్సిన పాల కోసం బయటికి వెళ్లగా వెళ్లి పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. పైకి కనిపించని గాయాలతో బాధపడుతూ ఎలాగోలా ఇంటి దాకా వెళ్లినా.. గుమ్మంలోనే కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు అతణ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ ఘటన తో అక్కడ అలజడి రేగింది. పోలీసుల దూకుడును నిరసిస్తూ జనం రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ బలగాలు వారిని అడ్డుకున్నాయి. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో హౌరా పోలీసులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. స్వామిని కొట్టలేదని చెబుతూనే.. అతని మృతికి లాఠీ దెబ్బలు కారణం కాదని - గుండె జబ్బు వల్లే అతను చనిపోయాడని పోలీసులు అంటున్నారు. అయితే, మృతుడి బంధువులు మాత్రం పోలీసులపై కేసు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 10కి చేరగా - ఒకరు మరణించారు. దేశవ్యాప్తంగా గురువారం ఉదయం 11 గంటల నాటికి కరోనా మరణాల సంఖ్య 15కు పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య 649కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 21,297కాగా, పాజిటివ్ కేసులు 4.71లక్షలకు పెరిగింది.