Begin typing your search above and press return to search.

మాల్యా సంగతి సరే మరి వీళ్ళ సంగతేంటి ?

By:  Tupaki Desk   |   1 Dec 2021 9:30 AM GMT
మాల్యా సంగతి సరే మరి వీళ్ళ సంగతేంటి ?
X
బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వారిలో ఒకడైన విజయామాల్యకు కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష పడబోతోంది. ఆ శిక్ష ఏమిటనేది వచ్చే ఏడాది జనవరి 18వ తేదీన ప్రకటిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పింది. సరే అసలు కేసుల విచారణ ఎప్పటికి తెములుతుందో తెలీకపోయినా కనీసం కోర్టు ధిక్కారం కేసులో అయినా శిక్షపడుతోంది. వివిధ బ్యాంకుల్లో మాల్యా రు. 9 వేల కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయినట్లు ఇప్పటికే సీబీఐ విచారణలో రుజువైంది.

సరే ఏదో కేసులో మాల్యాకు శిక్షపడుతోంది బాగానే ఉంది. మరి ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తుల సంగతేమిటి ? మాల్యా లాగే వేల కోట్లు రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తులు ప్రజా ప్రతినిధుల హోదాలో మనదేశంలో దర్జాగా తిరుగుతున్నారు. మాల్యాతో పాటు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోడీ లాంటి మరికొందరు కూడా వేల కోట్ల రూపాయలు దోచేసుకుని హ్యాపీగా విదేశాలకు చెక్కేశారు. అక్కడి నుండి భారత్ కు రాకుండా ఉండేందుకు అక్కడే ఏదో ఒక పెట్టీ కేసులో ఇరుక్కుని కోర్టుల్లో విచారణ పేరుతో అక్కడే కాలం గడిపేస్తున్నారు.

వేల కోట్ల రూపాయలు దోచేసుకుని విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళ సంగతిని పక్కనపెట్టేస్తే దేశంలోనే వివిధ పార్టీల్లో ఉన్న ఆర్ధిక నేరగాళ్ళ సంగతేమిటి ? చాలామంది చట్టసభల్లోను, ముఖ్యమంత్రి, మంత్రులుగాను చలామణి అవుతున్నారు. వీళ్ళపై సీబీఐ విచారణ జరిపి ఆర్ధిక నేరాలకు పాల్పడినట్లు ఇప్పటికే అన్ని ఆధారాలను కోర్టు ముందుంచింది.

వీళ్ళంతా బీజేపీలో ఉండటం లేదా బీజేపీతో అంటకాగటం వల్లే వీళ్ళపై ఎలాంటి చర్యలు ఉండటం లేదని ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలను దోచేసిన వీళ్ళంతా ప్రజా ప్రతినిధులు, మాజీల హోదాలో దర్జాగా తిరిగేస్తున్నారు. వీళ్ళందరిపైనా బ్యాంకుల కన్సార్షియం ఫిర్యాదులు చేశాయి. ఆ ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన సీబీఐ, ఈడీలు ఫిర్యాదులు నిజమే అని కోర్టులకు చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయినా వీళ్ళెవరిపైనా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవటంలేదో సామాన్య జనాలకు అర్ధం కావటంలేదు. మరి వీళ్ళ పాపం ఎప్పుడు పండుతుందో ఏమో చూడాల్సిందే.