Begin typing your search above and press return to search.

పవన్ పుణ్యం : స్థానిక ఎన్నికలకు పాతర!

By:  Tupaki Desk   |   15 March 2018 3:30 AM GMT
పవన్ పుణ్యం : స్థానిక ఎన్నికలకు పాతర!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు చంద్రబాబునాయుడు ఇక పాతర వేసినట్టే. మన ప్రభుత్వం అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా వాటిని నిర్వహించకుండా, నిరవధికంగా వాయిదా వేయడానికి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లు మనవాడే అంటూ అతి విశ్వాసం వ్యక్తం చేసిన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తాజాగా తన పార్టీ మహాసభల్లో, తెలుగుదేశం పార్టీ అచేతనత్వం మీద, చంద్రబాబు నాయుడు అసమర్థత మీద విరుచుకు పడిన నేపథ్యంలో... ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చునని పలువురు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తన తాజా సభలో చంద్రబాబునాయుడు తనయుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ మీద, అతని అవినీతి మీద కూడా విమర్శలు సూటిగా పెట్టిన సంగతి తెలిసిందే. పైగా పంచాయతీ స్థానిక సంస్థలు మునిసిపాలిటీల ఎన్నికలు రాబోతున్నాయి కదా... మన పార్టీ సత్తా ఏమిటో అక్కడే తేల్చుకుందాం అంటూ... పవన్ కళ్యాణ్ తన పార్టీ శ్రేణులకు సభాముఖంగా పిలుపు ఇచ్చారు . ఇప్పుడు కనుక పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే, లోకేష్ అవినీతిని ముక్కలు ముక్కలుగా విడదీసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ మరిన్ని విమర్శలు చేస్తారని తెలుగుదేశం భయపడుతోంది.

సాధారణంగానే తాను పరి పాలనలో ఉండగా స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి చంద్రబాబునాయుడు విముఖంగా ఉంటారనేది అందరికీ తెలిసిన సంగతి. అలాంటి ఎన్నికలు జరిగితే తన ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత బయటపడి, తర్వాతి సార్వత్రిక ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయనేది ఆయన భయంగా పలువురు చెబుతుంటారు. ఇలాంటి భయాలకు తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను కూడా స్థానిక పంచాయతీ ఎన్నికల రంగంలోకి రాబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు ఇక ఆ జోలికి వెళ్ళక పోవచ్చు అని పలువురు అంచనా వేస్తున్నారు.

ఆ రీతిగా ఈ ఏడాదిలో అనివార్యంగా జరగవలసి ఉన్న స్థానిక సంస్థల పంచాయతీల ఎన్నికలకు ఇక మంగళం పడినట్లే అని అందరూ విశ్లేషిస్తున్నారు.................