Begin typing your search above and press return to search.

రుయా అంబులెన్స్ ఘటనలో అసలేం జరిగింది ?

By:  Tupaki Desk   |   27 April 2022 5:37 AM GMT
రుయా అంబులెన్స్ ఘటనలో అసలేం జరిగింది ?
X
అంబులెన్స్ మాఫియా దాష్టీకం కారణంగా చనిపోయిన తన ఏడేళ్ళ కొడుకును ఓ తండ్రి మోటారుసైకిల్ పై పెట్టుకుని 70 కిలోమీటర్లు ప్రయాణం చేయటం సంచలనంగా మారింది. అంబులెన్సులో తీసుకెళ్ళాల్సిన మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకెళ్ళటం నిజంగా చాలా బాధాకరం. ఇంతటి బాధాకరమైన ఘటన వెనుక అసలేం జరిగింది ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రుయా ఆసుపత్రిలో మహాప్రస్థానం పేరుతో ఏర్పాటుచేసిన నాలుగు అంబులెన్సులు పనిచేస్తున్నాయి.

పిల్లాడు చనిపోయిన విషయాన్ని, అంబులెన్సులో మృతదేహాన్ని కడప జిల్లాలోని చిట్వేలుకు తీసుకెళ్ళాలన్న విషయాన్ని హాస్పిటల్ నర్సు అంబులెన్సు వాళ్ళకు చెప్పలేదు. అంబులెన్సులకు నర్సు ఎందుకు చెప్పలేదంటే ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంవో) అందుబాటులో లేరు కాబట్టి. అంటే ఆర్ఎంవో అనుమతి లేకుండా నర్సు చెప్పే అవకాశం లేదు కాబట్టే ఆమె సమాచారం ఇవ్వలేదు. తమకు సమాచారం అందలేదు కాబట్టి అంబులెన్సుల వాళ్ళు ఎవరూ రాలేదు.

ఆర్ఎంవో వస్తారని ఎదురు చూసిన నర్సుకు ఏమిచేయాలో అర్ధం కాలేదు. ఇదే సమయంలో మృతదేహాన్ని ఆసుపత్రి ఆవరణలోనో లేకపోతే బెడ్ పైనే ఎక్కువ సేపు ఉంచలేమని స్టాప్ చెప్పి బాడీని మార్చురీకి తరలిస్తామంటే అందుకు పిల్లాడి తండ్రి ఒప్పుకోలేదు.

చిట్వేలులోని తన బందులకు విషయం చెప్పగానే వాళ్ళే ఒక అంబులెన్సును పంపారు. అయితే సదరు అంబులెన్సును రుయా ఆసుపత్రిలోని డ్రైవర్ల మాఫియా అడ్డుకున్నది. తమ అంబులెన్సుల్లో తప్ప బయట అంబులెన్సుల్లో తీసుకెళ్ళేందుక లేదని అభ్యంతరం చెప్పారు.

దాంతో చేసేది లేక పిల్లాడి తండ్రి డెడ్ బాడీని మోటారు సైకిల్లో తీసుకుని వెళిపోయాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే డెడ్ బాడీనీ రుయా ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఇటు అలిపిరి దగ్గరో లేదా ఇస్కాన్ రోడ్డులోనో మోటారు సైకిల్ నుండి చిట్వేలు నుండి వచ్చిన అంబులెన్సులోకి మార్చుకోవచ్చు. రుయా ఆసుపత్రిలో అయినా అంబులెన్సుల డ్రైవర్లదే ఇష్టారాజ్యం. కానీ ఆసుపత్రి బయట వాళ్ళకి ఏమీ సంబంధం లేదు కదా. అలిపిరి దగ్గరో లేకపోతే ఇస్కాన్ రోడ్డులోనే డెడ్ బాడీని అంబులెన్సులో ఎందుకు మార్చుకోలేదో అర్ధం కావటం లేదు. మనకు అందిన సమాచారం మేరకు అయితే... అప్పటికి బంధువులు పంపిన అంబులెన్స్ చాలా సేపు అవడంతో వెళ్లిపోయిందని చెబుతున్నారు.

అయినా ఒక ఉన్నతాధికారి ఆస్పత్రిలో లేకపోతే అంబులెన్స్ వాడే అవకాశమే లేకపోవడం చూస్తే ప్రభుత్వం ఆస్పత్రుల నిర్వహణలో ఎంత ఘోరంగా విఫలం అవుతుందో చూడండి అని ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తోంది. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రవేశ పెట్టిన మహా ప్రస్థానం అంబులెన్స్ వాహనాలు జగన్ వచ్చాక ఆర్థిక భారం కారణంగా రద్దు చేశాడని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.