Begin typing your search above and press return to search.

లీడర్ పరేషాన్ : అసలు ఈ పార్టీలకు ఏమైంది...?

By:  Tupaki Desk   |   14 May 2022 6:29 AM GMT
లీడర్ పరేషాన్ : అసలు ఈ పార్టీలకు ఏమైంది...?
X
అవును. ఉన్నట్లుండి ఆల్ ట్రెడిషనల్ పార్టీస్ ఇలా రంగు రూపూ ఒక్కసారిగా ఎందుకు మార్చుకుంటున్నాయి. దశాబ్దాల బట్టి ఇదే మా విధానం. మేము ఇలాగే ఉంటాం అంటూ జబ్బలు చరచుకునే పార్టీలు ఒక్కసారిగా ఎందుకు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నాయి. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది. రోటీన్ పాలిటిక్స్ అని అంతా అనుకునే చోట ఎందుకింత వెరైటీ. ఒక్కసారిగా అంతా కూడబలుక్కున్నట్లుగా ఎందుకు ఇలా టోటల్ సీన్ చేంజి చేస్తున్నారు. ఇవన్నీ ప్రశ్నలే. అటు ప్రజలు వీటిని చూసి ఆశ్చర్యపోతుంటే ఆయా పార్టీలలో ఇప్పటిదాకా కొనసాగుతున్న లీడర్లు ఏకంగా పరేషాన్ అవుతున్నారు.

అసలు ఈ పార్టీలకు ఏమైంది. ఈ ప్రశ్నకు వెంటనే జవాబు కూడా ఉంది. ఏమీ కాకూడదనే. అంటే రొటీన్ రొడ్డకొట్టుడు గా కంటిన్యూ అయితే ఇక ఈ దేశాన ఏ పార్టీకి నామరూపాలు ఉండవన్న విషయం అర్ధమైపోయిందా అంటే అవును అనే జవాబు వస్తోంది. ఇదంతా మారిన జనాల నుంచి పార్టీలకు అందుతున్న ఫీడ్ బ్యాక్. అలాగే సోషల్ మీడియా యుగంలో సంప్రదాయ రాజకీయం చెల్లుబాటు కానే కాదు అన్న తెలివిడి. అంతే కాదు, ఎపుడూ చూసిన ముఖాలనే చూపిస్తూ ఉంటే జనాలకు బోరు కొట్టి ఏకంగా ఆ పార్టీల వైపే చూడడం మానేశారని. ఇలా చాలా విషయాల మీద అవగాహన ఉండడంతోనే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కసారిగా రూట్ మార్చేశాయి.

లేకపోతే శాతాధిక వృద్ధ పార్టీ కాంగ్రెస్ నోట ఎపుడూ వినని మాటలు ఇపుడు అంతా వింటున్నారు. ఒక ఫ్యామిలీకి ఒకరికే టికెట్. ప్రజలలో ఉండేవారికే పార్టీలో ఇక పైన చోటు, సీటు, సీనియర్ సిటిజ‌న్లకు కంప్లీట్ రెస్ట్. నో పోస్టు, నో టికెట్. యువ తరానికే పెద్ద పీట. ఇలా చాలానే చింతన్ శిబిర్ లో కాంగ్రెస్ నుంచి వస్తున్న సంచలన ప్రకటనలు. నిజంగా ఇలాంటి ఆలోచనలతో కనుక కాంగ్రెస్ అడుగులు ముందుకు వేస్తే భవిష్యత్తు బాగానే ఉంటుంది అంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే రొటీన్ పాలిటిక్స్ కి టీడీపీ కేరాఫ్ గా మారుతున్న వేళ చంద్రబాబు కూడా డేరింగ్ స్టెప్స్ వేస్తున్నారు. సీనియర్లకు టికెట్లు ఇవ్వం, వారు ఇక మీదట కేవలం సలహాదారులుగా మాత్రమే ఉంటారు, యువ రక్తంతో పార్టీకి పట్టాభిషేకం చేస్తామని బాబు చెబుతున్నారు. తన చుట్టూ తిరిగితే టికెట్ రాదని, జనంలో ఎవరు ఉంటే వారికే టికెట్ అని కూడా బాబు ఖరాఖండీగా చెబుతున్నారు. అదే విధంగా కొత్త ముఖాలకు చోటు కల్పిస్తామని ఆయన అంటున్నారు.

ఇక ఏపీలో అధికార వైసీపీ అయితే చాలా కాలంగా సీనియర్లను పక్కన పెడుతూ వస్తోంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో కూడా యువతకే ప్రాధాన్యత ఇచ్చారు. కీలక మంత్రిత్వ శాఖలు వారికే అప్పగించారు. ఒక విధంగా కొత్త నీరు అంటూ వైసెపీ 2019లో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితం ఇవ్వడంతో చంద్రబాబు కూడా 2024లో దాన్ని అమలు చేయబోతున్నారు అని అంటారు.

తెలంగాణాలో చూస్తే టీయారెస్ కూడా పెద్దళ్ళు వద్దే వద్దు అనే అంటోంది. ఆ పార్టీ సైతం కొత్త ముఖాలకే పట్టం అని చెబుతోంది. అక్కడ బీజేపీలో కూడా ఇదే రకమైన లెక్కలు వేస్తున్నారు. యువ రక్తం. యంగ్ బ్లడ్ అని కమలనాధులు ఒకటికి పదిసార్లు చెప్పుకొస్తున్నారు.

సరే పార్టీల సంగతి బాగానే ఉంది. వాటి విజన్ వాటికి ఉంది. కానీ పార్టీలో ఏళ్ళ తరబడి పాతుకుపోయిన సీనియర్ల సంగతేంటి, ఇలా ఒక పార్టీ తరువాత మరో పార్టీ సీనియర్లకు శఠకోపం పెడుతూంటే వారు ఎక్కడికి వెళ్తారు. వారి రాజకీయం ఎలా సాగేది. దీనికి జవాబు లేకనే సీనియర్ లీడర్లు తెగ పరేషన్ అవుతున్నారు. అపుడెపుడో ఒక మాట సగటు జనం నుంచి వినిపించేది. రాజకీయ నాయకులకు కూడా రిటైర్మెంట్ వయసు నిర్ణయించాలి అని. ఇపుడు జనంలో వస్తున్న మార్పులతో పార్టీలు కూడా ఆ దిశగా కదులుతున్నాయి. ఇదే అమలైతే కనుక ఈ పరిణామాలతో పూర్తిగా దెబ్బ తినేది సీనియర్ లీడర్లే సుమా.