Begin typing your search above and press return to search.

పెట్రో మంట‌ల దొంగ ఎవ‌రు? దోచేస్తోందెవ‌రు? అంద‌రూ సైలెంట్‌!!

By:  Tupaki Desk   |   27 Oct 2021 10:50 AM GMT
పెట్రో మంట‌ల దొంగ ఎవ‌రు?  దోచేస్తోందెవ‌రు?  అంద‌రూ సైలెంట్‌!!
X
దేశ‌వ్యాప్తం గా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ప్ర‌జ‌ల‌ ను ప‌ట్టిపీడిస్తున్నాయి. నానాటికీ పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు సామాన్యుల న‌డివిరుస్తున్నాయి. రోజుకు 35 పైసల చొప్పున‌.. పెంచుతున్న ఈ ధ‌ర‌లు సామాన్యుల నుంచి మ‌ధ్య‌ త‌ర‌గ‌తి వ‌ర్గాల వ‌ర‌కు కూడా చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. అటు దేశం లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం గా ఉన్న కాంగ్రెస్ నోరు విప్ప‌దు. క‌మ్యూనిస్టులు.. ప్ర‌క‌ట‌న‌ల‌ కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. ఇక‌, నేను సైతం అంటూ.. మోడీ స‌ర్కారు పై విరుచుకు ప‌డే.. ఢిల్లీ సీఎం.. కేజ్రీవాల్ కానీ.. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌ మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కానీ.. పెద‌వి విప్ప‌రు. మ‌రి వీరంతా ప్ర‌జ‌ల నేత‌లు కారా? అనేది ప్ర‌శ్న‌.

అంతే కాదు.. అస‌లు పెట్రో మంట‌లు ఈ రేంజ్‌ లో పెరిగిపోవ‌డానికి కార‌కులు ఎవ‌రు? భారీ ఎత్తున దోచే స్తున్న‌ది ఎవ‌రు? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. బీజేపీ అనుకూల మీడియా లో పెట్రో ధ‌ర‌ల‌ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు.. వ్యాఖ్యానాలు.. వార్త‌లు వ‌స్తున్నాయి. పెట్రో ధ‌ర‌లు పెరిగిపోవ‌డం వ‌ల్ల దేశం లో ఆర్థిక వ్య‌వ‌స్థ గాడిన ప‌డుతుందంటూ.. ప్ర‌ఖ్యాత జ‌ర్న‌లిస్టులు నొక్కి వ‌క్కాణిస్తున్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. ఎందుకు కాంగ్రెస్ మాట్లాడ‌లేక పోతోంది? అనేది ప్ర‌శ్న‌. అదే స‌మ‌యంలో బీజేపీ.. కూడా ఎందుకు ఇలా పెంచుకుంటూ పోతోంది? అనేది మ‌రో ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

కాంగ్రెస్ విష‌యాన్ని చూస్తే.. గ‌త రెండు ద‌ఫాల యూపీఏ పాల‌న‌ లో.. అన్ని వ‌ర్గాల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ ను ప్ర‌తి 15 రోజ‌లు కు ఒక‌సారి స‌మీక్షించుకునే అధికారాన్ని క‌ల్పిస్తూ.. ఏకం గా.. పార్ల‌మెంటు లోనే చ‌ట్టం చేశారు. దీని కి అనేక కార‌ణాలు చెప్పారు. అంత‌ర్జాతీయ స్థాయి లో ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగినా.. త‌రిగినా.. వెంట‌నే ఆ ప్ర‌యోజ‌నాల‌ను వినియోగ‌దారుల‌కు బ‌ట్వాడా చేసేందుకు.. అంటూ.. 2005-06 మ‌ధ్య కాలం లో ఈ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చారు. ఇక‌, త‌దుప‌రి ఇదే యూపీఏ హ‌యాంలో దీనిని 15 రోజుల నుంచి వారానికి కుదించారు.

అంటే.. గ‌త యూపీఏ హ‌యాం లోనే పెట్రోల్‌.. ధ‌ర‌ల‌ ను తొలుత 15 రోజుల‌కు.. త‌ర్వాత వారానికి స‌వ‌రించి.. ప్ర‌జ‌ల నెత్తిన గుది బండ మోపే నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే... మోడీ స‌ర్కారు కు వ‌ర‌మైంది. ఇక‌, ప్ర‌స్తుత ఎన్డీయే తొలి ద‌శ లో.. మోడీ స‌ర్కారు.. ప్ర‌తి రోజూ ధ‌ర‌ల‌ను స‌మీక్షింకునే అధికారం క‌ల్పించింది. ఇంకే ముంది.. రోజూ.. ధ‌ర‌ల్లో పెరుగుద‌ల‌.. కుదిరితే..ఎప్పుడైనా.. త‌గ్గుద‌ల న‌మోద‌వుతోంది. ఇటీవ‌ల కాలం లో క‌రోనా ఎఫెక్ట్ కార‌ణం గా.. ఈ ధ‌ర‌ల‌ కు అడ్డు అదుపు లేకుండా ముందుకు పోతున్నాయి. సో.. ఇత‌మిత్థం గా.. పెట్రో ధ‌ర‌ల పాపం.. కాంగ్రెస్ దే! అందుకే ఆ పార్టీ జాతీయ ఉద్య‌మాల‌కు పిలుపు ఇవ్వ‌దు. ఇస్తే.. బీజేపీ నేత‌లు.. తూర్పార‌బ‌ట్ట‌డంతోపాటు.. పాత పాపాల‌ను తెర‌ మీదికి తెచ్చి.. ఉన్న ఓటు బ్యాంకు ను కూడా దూరం చేస్తార‌ని భ‌యం!

పోనీ.. పెట్రోల్ ధ‌ర‌ల‌ ను జీఎస్టీ ప‌రిధి లోకి తీసుకురావ‌చ్చుగా.. అంటే.. ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిసా, తెలంగాణ , ఏపీ వంటి అనేక రాష్ట్రాలు.. వీటి లో క‌మ్యూనిస్టు పాలిత కేర‌ళ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.. స‌సేమిరా అంటున్నారు. కార‌ణం.. త‌మ డ‌బ్బుల‌ కు, ఖ‌జానా కు న‌ష్టం వాటిల్ల‌కూడ‌ద‌నే. సో.. మొత్తానికి రాజ‌కీయంగా.. న‌లిగిపోతున్న పెట్రోల్ స‌మ‌స్య ప‌రిష్కారం ఎప్పుడు.. అంటే.. అనంతం!! అనే స‌మాధాన‌మే వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.