Begin typing your search above and press return to search.

కేంద్రం లెక్క ప్రకారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆస్తులు ఎంతంటే?

By:  Tupaki Desk   |   9 March 2021 2:58 AM GMT
కేంద్రం లెక్క ప్రకారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆస్తులు ఎంతంటే?
X
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును కేంద్రంలోని మోడీ సర్కారు అమ్మాలని నిర్ణయించటం తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు చెందిన పలువురు మేధావులు సైతం ఈ విధానాన్ని తప్పు పడుతున్నారు. మరోవైపు ఏపీ ప్రజలు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ.. పెద్ద ఎత్తున ఆందోళనలు.. నిరసనలు చేపడుతున్నారు.

అయితే.. ఈ నిరసనలేవీ కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మే నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే ఉద్దేశమే లేదన్న విషయాన్ని మరోసారి తేల్చి చెప్పింది. అదే సమయంలో ఈ కర్మాగారాన్ని అమ్మేందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది. లక్ష కోట్లకు పైనే ఆస్తులు ఉన్నట్లు చెప్పే విశాఖ ఉక్కును.. కేంద్రం దాని విలువను లెక్క కట్టింది. తాజాగా లోక్ సభలో కేంద్రమంత్రి చెప్పిన ప్రకారం చూస్తే.. వైజాగ్ స్టీల్ ఆస్తుల విలువ రూ.31,022 కోట్లుగా లెక్క తేల్చింది.

లోక్ సభలో అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేంద్రమంత్రి.. సంస్థ భూములు.. ప్లాంట్.. పరికరాలు.. చరాస్తుల స్థూల విలువ 2020 డిసెంబరు 31 నాటికి రూ.32,022 కోట్లుగా తేల్చారు. ఈ సంస్థలో కేంద్ర మూలధన వాటా కింద గత డిసెంబరు నాటికి రూ.4889.85 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. గడిచిన ఐదేళ్లలో నాలుగేళ్ల పాటు సంస్థకు నష్టాలు వాటిల్లినట్లు చెప్పారు. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం 2018-19లో మాత్రం లాభం వచ్చినట్లుగా లెక్కల్లో చూపారు. 2015-16లో పన్ను చెల్లింపు తర్వాత నష్టం రూ.1420.64 కోట్లు కాగా.. 2019-20 నాటికి రూ.3910.17 కోట్లుగా తేల్చారు.