Begin typing your search above and press return to search.

ప్రభుత్వ సలహాదారులపై ఏపీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏమిటి?

By:  Tupaki Desk   |   9 July 2021 4:11 AM GMT
ప్రభుత్వ సలహాదారులపై ఏపీ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏమిటి?
X
ఏపీ ప్రభుత్వ సలహాదారుల విధుల స్వభావం ఏమిటి? వారేం మాట్లాడాలి? వారేం మాట్లాడకూడదు? లాంటి అంశాలతో పాటు.. వారికి సంబంధించిన విధివిధానాల మీద ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకూ అసలీ వ్యవహారం హైకోర్టు ఎదుటకు ఎందుకు వచ్చింది? అన్న విషయంలోకి వెళితే.. ఏపీ ప్రభుత్వ కార్యదర్శిగా వ్యవహరించిన నీలం సాహ్నిని పదవీ విరమణ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఎంపిక చేయటాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో దాఖలు చేశారు. దీనిపై తాజాగా కేసు విచారణ సాగింది.

ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారులు.. సలహాదారుల నియామకం విధానం.. వారికి అప్పగించిన విధుల స్వభావం ఏమిటి? విధుల నిబంధనలు.. విధివిధానాలు ఏమిటో అడిషనల్ అఫిడవిట్ ను తమకు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. కొందరు సలహాదారులు రాజకీయ అంశాల్ని మీడియాతో మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.

‘‘రాజకీయ అంశాలు మీడియాతో మాట్లాడటం చట్ట వ్యతిరేకం కాదా? సలహాదారులకు అప్పగించిన విదులను పరిశీలించాలని మేం భావిస్తున్నాం. ప్రభుత్వ కార్యదర్శులు.. ఉన్నతాధికారులతో సలహాదారులు సమీక్ష సమీవేశాల్ని నిర్వహించవచ్చా?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. ఇక.. నీలంసాహ్ని నియామకంపై ఆసక్తికర చర్చ నడిచింది. తొలుత ఆమె ప్రభుత్వ కార్యదర్శిగా ఉండటం.. ఆ పై ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా బాధ్యత అప్పగించటం.. అనంతరం ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. దీనికి సంబంధించిన కొన్ని సాంకేతక అంశాలు తాజాగా తెర మీదకు వచ్చాయి.

‘నీలం సాహ్ని 2020 డిసెంబరు 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. అయితే.. డిసెంబరు 22నే ఆమె ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. 2021 మార్చి 27న ఆమె తన పదవికి రాజీనామా చేశారు. దానికి ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు పంపిన నియామక విషయంలో నీలంసాహ్ని పేరు ఉండటాన్ని ప్రశ్నించారు.

కేసు విచారణలో భాగంగా సీనియర్ న్యాయవాది.. ప్రభుత్వ తరఫున కేసును వాదిస్తున్న సీవీ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు అడ్వకేట్ జనరల్ గా పని చేసినప్పుడు ప్రభుత్వంలోని సలహాదారులు ప్రభుత్వ.. రాజకీయ విషయాల్ని మీడియాతో మాట్లాడటం.. పత్రికా సమావేశాల్ని నిర్వహించటం గమనించిరా? అని సూటి ప్రశ్నను వేసింది. దీనికి ఆయన గమనించలేదని పేర్కొన్నారు. సలహాదారులుగా వ్యవహరిస్తున్న వారు ప్రజాధనాన్ని వేతనంగా తీసుకుంటూ రాజకీయాలు ఎలా మాట్లాడతారు? అంటూ కీలక వ్యాఖ్య చేసింది. మొత్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వ సలహాదారుల మీద విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. తాజాగా చోటు చేసుకున్న హైకోర్టు వాదనలు.. ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.