Begin typing your search above and press return to search.

అమెరికాలో వీసాల షాక్‌...ఈ వీసాకు వ‌ర్తించ‌దు

By:  Tupaki Desk   |   25 July 2018 2:43 PM GMT
అమెరికాలో వీసాల షాక్‌...ఈ వీసాకు వ‌ర్తించ‌దు
X
అగ్రరాజ్యం - అవ‌కాశాల స్వ‌ర్గం అనే పేరున్న అమెరికాలో దూకుడుకు పెట్టింది పేర‌యిన డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచ‌ల‌న వార్త‌లు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ అమెరికా కలలు కనే వారికి ఆందోళన క‌లిగించేవే ఎక్కువ‌. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితులు సృష్టించిన ట్రంప్ ఇన్నాళ్లు హెచ్‌1బీ​ - హెచ్ 4 వీసా మార్పుల గురించి సంచ‌ల‌న విష‌యాలు వెలువ‌రించారు. అయితే, ట్రంప్ వేటుకు చిక్క‌ని వీసాల కేట‌గిరీలో కీల‌క వీసా చేరింది. ఈబీ-5 ఇన్వెస్టర్ వీసాలతో అమెరికాలో మ‌న‌వాళ్లు అవ‌కాశాలు వెతుక్కుంటున్నారు.

ప్రతి ఏడాది అమెరికా సుమారు పదివేల మందికి ఈబీ-5 వీసాలను జారీ చేస్తుంది. ఈబీ5 వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో కనీసం ఒక మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అంతేకాక ఓ పదిమందికి తప్పకుండా పర్మినెంట్‌ జాబ్‌ కల్పించాలి. ఇలా పెట్టుబడి పెట్టిన విదేశీయులకు గ్రీన్‌ కార్డు లభిస్తుంది. అలా కాని పక్షంలో ప్రభుత్వం అప్రూవ్ చేసిన బిజినెస్ లో 37 కోట్ల రూపాయల పెట్టబడి పెట్టాలి. అలా చేస్తే ప్రభుత్వమే పది మంది అమెరికన్లకు ఉద్యోగాలిస్తుంది. ఈ మొత్తం మళ్లీ వెనక్కి కావాలనుకుంటే ఐదేళ్ల తరువాత తన డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఈబీ-5 వీసాల కోసం దరఖాస్తుల తీరుపై కానామ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభినవ్‌ లోహియా మాట్లాడుతూ ఈ సంవత్సరం భారత్‌ నుంచి చేసే వారి సంఖ్య వెయ్యికి చేరుతుందని ఈ వీసా సర్వీసులు అందించే విలేకరులతో చెప్పారు. ‘హెచ్‌-1బి వీసాల జారీ కష్టమవడంతో ప్రస్తుతం చాలా మంది భారతీయులు - ముఖ్యంగా అమెరికాలో పిల్లల విద్యాభ్యాసం కోసం చూస్తున్న సంపన్న భారతీయులు ఈ వీసాలపై ఆసక్తి చూపిస్తున్నారు’ అని ఆయ‌న తెలిపారు. గత సంవత్సరం 500 మంది భారతీయులు ఈ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అంతకు ముందు సంవత్సరం కంటే ఇది 22 శాతం ఎక్కువ. ఇటీవల హైదరాబాద్‌ నుంచి ఇబి-5 వీసాలకు గిరాకీ పెరుగుతోందన్నారు.

కాగా, ఈబీ5 వీసాలను పొందుతున్న వారి లిస్టులో భారత్ మూడవ స్థానంలో ఉంది. మనకంటే చైనా - వియత్నాం దేశాలు ఆ జాబితాలో ముందంజలో ఉన్నాయి. అయితే చైనాకు చెందిన పెట్టుబడిదారులు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈబీ-5 వీసా వ్యవస్థను రద్దు చేయాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి.